ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యానికి లేఖ రాసారు. ఇటీవల ఒక పత్రికకు సీఎస్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి వివరణ కోరుతూ చంద్రబాబు ఈ లేఖ రాసారు. 'అధికారాలు లేని సీఎం' అని సీఎస్ ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రిని సంబోధించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సీఎం అధికారాలు ఏంటో చెప్పే పని సీఎస్ ది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎస్ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని చంద్రబాబు తెలిపారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. "
"మీరు హుందా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో ప్రచురితమైనట్లుగా ఉన్న వ్యాఖ్యలు మీరు చేశారా! దీనిపై మీ వివరణ ఏమిటి?’’ అని ఎల్వీ సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. సీఎస్ వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని, చాలా తీవ్రమైనవని కొందరు సీనియర్ మంత్రులు, అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి వద్ద కూడా కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్వీ వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి నియమిస్తారు. తన విధులు, బాధ్యతల నిర్వహణలో ప్రధాన కార్యదర్శి సంబంధిత అంశాలను సీఎంకు నివేదిస్తారు. ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రి. ఆయనకు అధికారాలు ఉన్నాయో లేవో వ్యాఖ్యానించే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎంకు ఏ మేరకు అధికారాలుంటాయో భాష్యం చెప్పే పని సీఎ్‌సది కాదు. ఆ విషయంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఎన్నికల కమిషన్ తన వివరణ ఇస్తుంది తప్ప సీఎస్ కాదు’’ అని సీఎం వద్ద జరిగిన చర్చలో అభిప్రాయపడ్డారు.
ఎల్వీ తన పరిధిని అతిక్రమించారన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నేరుగా ఆయనకు దీనిపై లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రధాన కార్యదర్శిని సంజాయిషీ కోరుతున్నట్లు కాకుండా వివరణ కోరుతున్నట్లుగా రాసినట్లు సమాచారం. ‘‘ముఖ్యమంత్రికి అధికారాలు లేవని మీరు చెప్పినట్లుగా ఒక పత్రికలో వచ్చిన మీ ఇంటర్వ్యూ చూశాను. మీ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం పనిచేస్తాయి. ఎన్నికల కోడ్ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశమంతా అమల్లో ఉంది. అన్ని చోట్లా ఒకటే కోడ్ అమల్లో ఉంటుంది తప్ప రాష్ట్రానికో రకంగా ఉండదు. మరే రాష్ట్రంలోనూ అధికారులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక్కడ మీరిలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వండి’’ అని ఆ లేఖలో సీఎం కోరినట్లు చెబుతున్నారు.