శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రూ.1200 కోట్ల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం ఇంకో లేఖ రాశారు. ఈ నెల 13న ప్రధానికి, 15న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి తాను లేఖలు రాసినా స్పందన లేకపోవడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరమని చంద్రబాబు ఆ లేఖలో రాసారు.

cbn letter 21102018 2

‘రూ.1200 కోట్ల తక్షణ సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఈ నెల 13న మీకు నిదేదిక అందజేశాం. తుపాను నష్టం ప్రాథమిక అంచనాలు రూ.3,435.29 కోట్లుగా పేర్కొంటూ ఈ నెల 15న కేంద్ర హోం మంత్రికి, హోం శాఖ కార్యదర్శికి నివేదికలు ఇచ్చాం. తక్షణ సాయం ప్రకటించాలని నేను పదే పదే విజ్ఞప్తి చేసినా మీ కార్యాలయం నుంచి కనీస స్పందన లేకపోవడం, పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఎలాంటి బృందాన్ని పంపించకపోవడం విచారకరం. కేంద్రం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. తుపాను వల్ల దెబ్బతిన్న 2.25 లక్షల కుటుంబాలకు సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసేందుకు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు రూ.1,200 కోట్ల తక్షణ సాయం ప్రకటించాల్సిందిగా మరోసారి కోరుతున్నాను’’ అని ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

cbn letter 21102018 3

‘‘తుపాను బీభత్సానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 1,802 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 16 మంది చనిపోయారు. అపార పంట నష్టం జరిగింది. కొబ్బరి, జీడి మామిడి తోటలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా తుపాను దెబ్బకు మరో 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిపోయింది. నాటి ప్రకృతి బీభత్సాన్ని తలుచుకుని జిల్లా ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నారు. గత పది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల వారీగా ప్రాథమిక నష్టం అంచనాలు, సహాయ పునరావస కార్యక్రమాల వివరాలను ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 22 నాటికి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాల సేకరణ పూర్తవుతుందన్నారు. ‘‘నేను నా మంత్రి వర్గ సహచరులు 15 మందితో కలసి వారం రోజులు తుపాను ప్రభావిత ప్రాంతంలోనే మకాం వేసి సహాయ, పునరావాస కార్యక్రమాల్ని పర్యవేక్షించాను. ఇప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read