ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసారు. ఆర్థిక మంత్రిగా మీ చర్యలు అభినందనీయమంటూనే చంద్రబాబు ఆమె నిర్ణయాలను తప్పు బట్టారు, ఆంధ్రప్రదేశ్ పేరుతొ ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఆంధ్రాబ్యాంకు పేరు కనుమరుగవటం, తెలుగు ప్రజలకు బాధ కలిగించే విషయం అని, సెంటిమెంట్ తో కూడుకున్న విషయం అని చంద్రబాబు అన్నారు. ఆంధ్రాబ్యాంక్ కూడా తెలుగువారికి ఎన్నో సేవలు చేసిందని గుర్తు చేసారు. ఇన్నేళ్ళ పాటు ఎంతో నమ్మకంతో పని చేసిన ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చకూడదు అని, తెలుగు ప్రజల మనోభావాలు గుర్తించాలని చంద్రబాబు కోరారు. అయితే విలీనం అనివార్యమైతే మాత్రం, ఆంధ్రాబ్యాంక్ పేరునే కొనసాగించాలని చంద్రబాబు కోరారు.
మచిలీపట్నం వేదికగా ఏర్పాటైన ఆంధ్రాబ్యాంక్ ని కనుమరుగు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బ్యాంక్‌ల విలీనంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక ఆంధ్రాబ్యాంక్ మనుగడ ఏమిటో అర్ధం కావటం లేదు. ఆంధ్రాబ్యాంక్ శతాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతున్న వేళ, ఈ వార్తా విన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ అయ్యారు. 1923వ సంవత్సరంలో డా. భోగరాజు పట్ట్భా సీతారామయ్య లక్ష రూపాయల మూల నిధితో, ఆంధ్రాబ్యాంక్‌ను ప్రారంభించారు. 1980 సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్‌ను జాతీయం చేశారు. అప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది.
అయితే ఇప్పుడు ప్రభుత్వ బ్యాంక్ ల విలీనంలో భగంగా, ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా విలీనం చేసుకోండి, ఆంధ్రా బ్యాంక్ పేరు మాత్రం, మార్చకండి అంటూ ప్రజలు కోరుతున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా, ఈ విషయం పై కేంద్రానికి లేఖ రాసి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా, నిర్ణయం తీసుకోవలాని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా ఈ విషయం పై నిరసన తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు కూడా లేఖ రాయటంతో, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.