కడప జిల్లాలో వైరి వర్గాల మధ్య రాజీ కుదిర్చే దిశగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అనుసరించిన వ్యూహం ఫలించింది. తదనుగుణంగా కడప ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణరెడ్డి.. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు ప్రతిపాదించిన రాజీ ఫార్ములాకు వీరిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి రామసుబ్బారెడ్డి అంగీకరించారు. ఆ ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కార్యాలయంలో అందజేశారు.
ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆదినారాయణరెడ్డి వర్గానికి ఇవ్వనున్నారు. ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు సుబ్బరామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తే వారి అనుచరులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగే కోరుకుని దానికి బదులుగా తన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి తన ఆమోదం తెలిపారు. ఏ సమస్య వచ్చినా తానున్నానని చంద్రబాబు ఆయనకు భరోసా ఇచ్చారు.
ఆదినారాయణరెడ్డి కూడా సీఎంను కలిశారు. కడప ఎంపీ సీటును ఈసారి టీడీపీ గెలవాలని, దానికి అవసరమైన వ్యూహ రచనతో ముందుకెళ్లాలని ఆయనకు చంద్రబాబు సూచించారు. అనంతరం ఆది, రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో టీడీపీ గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేస్తామన్నారు. అదే జరిగితే టీడీపీకి తిరుగుండదని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. పులివెందులలో వైసీపీకి వచ్చే మెజారిటీని జమ్మలమడుగులో సమానం చేయగలిగితే కడప ఎంపీ సీటును గెలుచుకోవచ్చన్నది టీడీపీ వ్యూహం.