ఏపీ రాజధాని జిల్లా గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ డిజైన్ ఇనిస్టిట్యూట్(ఎన్ఐడీ) పేరును మారుస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్ఐడీ-విజయవాడ పేరుతో ఉన్న ఈ సంస్థను ఎన్ఐడీ-అమరావతిగా మార్పు చేశారు. అందప్రదేశ్ ప్రభుత్వం సూచన మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంస్థలో ప్రొఫెసర్ హోదాకు సమానంగా ప్రిన్సిపల్ డిజైనర్‌ను నియమించాలని బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చట్టం-2014’ను సవరించి పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కూడా కేబినెట్ అంగీకరించింది.
014 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చట్టంద్వారా ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా దేశంలో మరో మూడు సంస్థలు ఎన్ఐడి భోపాల్ (మధ్యప్రదేశ్), ఎన్ఐడీ జోర్హాట్ (అసోం), ఎన్ఐడీ కురుక్షేత్ర (హర్యానా)లను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నాలుగు సంస్థలను జాతీయ ప్రాధాన్యత గల సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి మండలి చట్ట సవరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని ఎన్ఐడీ అహ్మదాబాద్‌తో సమానంగా జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తించబడుతుంది. వచ్చే శీతాకాల సమావేశంలో జాతీయ ప్రాముఖ్యత సంస్థలుగా ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనివల్ల డిజైన్లలో అత్యున్నత నైపుణ్యం గల వారిని తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంలో కొత్త పథకం ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్(పీఎం ఆశ)కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇథనాల్ ధరను రూ.47.49 నుంచి రూ.52.43కు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 నాటికి అన్ని బ్రాడ్ గేజ్ రైలు మార్గాలను వందశాతం విద్యుదీకరణ చేయడం, విజయవాడ, జోర్హాట్, భోపాల్, కురుక్షేత్రలో ఎన్‌ఐడీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.