వరదలతో సతమతమవుతున్న కేరళకు ఆర్థిక సాయంతో పాటు సహాయక సేవలు కూడా అందించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు శనివారం గన్నవరం నుంచి పలు బృందాలు ప్రత్యేక విమానంలో బయలుదేరాయి. ఏడుగురు అధికారులు సహా 66మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక అధికారితో పాటు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం, బోట్ మెకానిక్, స్విమ్మింగ్ ఇన్‌స్ట్రక్టర్, 12మోటారు బోట్లు, ఇతర రక్షణ పరికాలతో బృందాలు కేరళకు పయనమయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ఈ చర్యలు చేపట్టింది. అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌తో చంద్రబాబు మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణశాఖ, అగ్నిమాపకశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు శనివారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి వాయుసేన విమానాల్లో కొచ్చి తిరువనంతపురంకు వెళ్లాయి. విపత్తు నిర్వహణశాఖ కమిషనరు ఎంవీ.శేషగిరిబాబు, అగ్నిమాపకశాఖ డైరెక్టరు జనరల్ కె.సత్యనారాయణ తదితరులు కేరళ అధికారులతో మాట్లాడారు. వారితో సమన్వయం చేసుకుని ఈ బృందాలను పంపించారు. కేరళ వెళ్లిన బృందంలో 79 మంది సిబ్బంది ఉన్నారు. 12 బోట్లు, 100కుపైగా లైఫ్ జాకెట్లు, ఇతర సహాయక సామగ్రిని పంపించారు.
మరో పక్క, కేంద్రం, రాష్ట్రాన్ని ఒక విజ్ఞప్తి కోరింది. కేరళలో వరదలతో అల్లాడుతున్న పశువులకు కోసం గడ్డిని పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ విజ్ఞప్తికి రాష్ట్రం సానుకూలంగా స్పందించింది. త్వరలో పశువుల మేత కోసం పాతర గడ్డిని పంపించనుంది. వరద బాధితులకు విరాళం ఇచ్చేందుకు రైస్ మిల్లర్లూ ముందుకు వస్తున్నారు. మరోవైపు కేరళకు సహాయం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిస్తూ కలెక్టర్లు జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.