ఏపీకి కేంద్రం మరోసారి మొండిచేయి చూపించింది. అటల్ భూజల్‌లో రాష్ట్రానికి చోటు దక్కలేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే స్థానం కల్పించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రంపై పోరు తీవ్రతరం చేయనుంది. రాష్ట్ర విభజనతో ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు, సాయం విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిన కేంద్రం... అందుకు విరుద్ధంగా మళ్లీ మొండిచేయి చూపింది. భూగర్భజలాలు పెంచడానికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో రూ. 6వేల కోట్లతో కేంద జలవనరుల మంత్రిత్వ శాఖ అటల్ భూజల్ యోజనలో ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కలేదు. ఎప్పటి మాదిరిగానే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక మినహా మరో రాష్ట్రానికి స్థానం దక్కలేదు. ఉత్తరాదిలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
పథకం కింద రాష్ట్రం 25 శాతం భరిస్తే... కేంద్రం మిగిలిన 75 శాతం నిధులు ఇస్తుంది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో 8,350 గ్రామ పంచాయతీల్లో అటల్ భూజల్ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న నీరు-ప్రగతి, నీరు -చెట్టు స్ఫూర్తితో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించినా... ఏపీని మాత్రం ఇందులో చేర్చలేదు. ఇందులోనే కాదు సమగ్ర శిక్షా అభియాన్ నిధుల్లోనూ ఏపీకి మొండి చేయి చూపించింది. ఇటీవలే కేంద్రం ప్రాథమిక (సర్వశిక్షా అభియాన్), మాధ్యమిక(రాష్ట్రీయ శిక్షా అభియాన్) విద్యారంగాలతో పాటు ఉపాధ్యాయ విద్యావ్యవస్థలను కలిపేసి ‘సమగ్ర శిక్షా అభియాన్’ పేరుతో ఒక కొత్త సొసైటీని ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాలు కూడా పూర్వ సొసైటీలను రద్దు చేసి సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో కొత్త సొసైటీలను ఏర్పాటు చేసుకున్నాయి.
ఏపీ కూడా ఈ ఏడాది మే 9న ఢిల్లీలో జరిగిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏబీ) సమావేశానికి హాజరై సమగ్ర శిక్షా అభియాన్ కింద 2018-19 విద్యా సంవత్సరానికి కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపింది.దాదాపు రూ.4వేల కోట్లకు ప్రతిపాదనలు ఇస్తే కేంద్రం కేవలం రూ.1875కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ నిధులు ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగాలకు ఏమాత్రమూ సరిపోవని విద్యాశాఖ అధికారులే వాపోతున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా అదిగో... ఇదిగో అని చెప్పిన కేంద్ర ప్రభుత్వ అధికారులు గురువారం విడుదల చేసిన నిధుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడం చూసి అధికారులు షాక్ అయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని మొత్తం 36 రాష్ట్రాలకుగానూ సమగ్ర శిక్షా అభియాన్ కింద రూ.8229.33 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.8109.59 కోట్లను అడ్‌హాక్ కింద విడుదల చేసింది.