కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్నవైసిపీ ప్రభుత్వానికి మొన్నటిదాక మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించాయి. ఏకంగా ప్రధాన మంత్రి, హలో విజయ్ గారు అని పలకరించేంత సాన్నిహిత్యం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఏమి అడిగినా సరే కేంద్రం ఒకే అంటుంది అనే ప్రచారం రాష్ట్రంలో సాగించింది వైసీపీ. దానికి తగ్గట్టే విజయసాయి రెడ్డి కూడా, మేము ఏ పని చేసినా, మాకు మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి అంటూ, మీడియా ముందు చెప్పారు. అయితే కేంద్రం మాత్రం, పెద్దగా సహకరించింది లేదు. విద్యుత్ ఒప్పందాల సమీక్ష కాని, పోలవరం రీ టెండరింగ్ కాని, నిధులు విషయంలో కాని, ఇలా ఏ విషయంలోనూ కేంద్రం, రాష్ట్రానికి సహకారం లేదు. ఇదే కోవలో, తమకు నచ్చిన అధికారాలును, రాష్ట్రానికి తెచ్చుకునే విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ప్రచారం బెడిసి కొట్టింది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, తెలంగాణాలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించుకునే ప్రయత్నం చేసారు. తెలంగాణా ప్రభుత్వాన్ని, ఈ విషయం పై అడగగానే, కేసిఆర్ కూడా ఒప్పుకున్నారు. స్టీఫెన్ రవీంద్రను డెప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు. దేంతో స్టీఫెన్ రవీంద్ర కూడా తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా దాదపుగా ఖరారు అయిపోయాను అనుకుని, ఆయన తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి, అనధికారికంగా పని చెయ్యటం మొదలు పెట్టారు. ముఖ్యమైన ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయనే ప్రచారం కూడా ఉంది. అయితే, స్టీఫెన్ రవీంద్రను అధికారికంగా, తమకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రాన్ని కోరింది.
దాదపుగా మూడు నెలల పాటు పెండింగ్ లో పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అదిగో ఇదిగో అంటూ హడావడి చేసింది. అయితే చివరకు, స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించటం కుదరదు అంటూ ప్రభుత్వానికి చెప్పింది. స్టీఫెన్ రవీంద్రను ఏపికి పంపించటం కుదరదు అని, తెలంగాణాకు వెళ్ళిపోవాలని కోరటంతో, ఆయన తెలంగాణాకు వెళ్ళిపోయి విధుల్లో చేరారు. దీంతో, జగన్, విజయసాయి రెడ్డిలకు షాక్ తగిలినట్టు అయ్యింది. విజయసాయి రెడ్డి, ప్రత్యేకంగా అమిత్ షా వద్దకు వెళ్లి మరీ స్టీఫెన్ రవీంద్ర కోసం అడిగారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి అడిగారు. అయినా అటు ప్రధాని మోడీ కాని, హోం మంత్రి అమిత్ షా కాని, కనికరించలేదు. కేంద్ర వర్గాలు సమాచారం ప్రకారం, స్టీఫెన్ రవీంద్రను, ఏపి పంపటానికి సరైన కారణం చెప్పలేదని, అందుకే కేంద్రం ఒప్పుకోలేదని చెప్పారు.