నవ్యాంధ్ర ప్రజల ఏడు దశాబ్దాల కల, జీవనాడి పోలవరం ప్రాజెక్టు మొన్నటి వరకు పరుగులు పెట్టింది. అటు చంద్రబాబు పర్యవేక్షణ, మరో పక్క నవయుగ స్పీడ్ చూసి, పోలవరం కల సాకారం అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మారటం, జగన్ ప్రభుత్వం రావటంతో, పోలవరం పై మళ్ళీ ఆందోళన మొదలైంది. నిన్న అనూహ్యంగా, నవయుగను పోలవరం ప్రాజెక్ట్ నుంచి తప్పుకోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర ప్రాజెక్ట్ కావటంతో, ఈ విషయం పై కేంద్రం ఎలా స్పందిస్తుందా అని అందరూ అనుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం, పోలవరం ప్రాజెక్ట్ నుంచి నవయుగను తప్పించే విషయం ఇప్పటికే కేంద్రంతో మాట్లాడారని, కేంద్రం ఒప్పుకుంది అంటూ ప్రచారం చేసారు.
ఈ నేపధ్యంలో పోలవరం టెండర్లు రద్దు చెయ్యటం పై కేంద్రం స్పందించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం టెండర్లను, ఏపి ప్రభుత్వం రద్దు చెయ్యటం పై ఎంతో ఆవేదనతో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు ఏపి ప్రభుత్వం రద్దు చెయ్యటం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో, గుంటూరు ఎంపీ, తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు, సమాధానం చెప్పారు కేంద్రం మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న ఈ చర్యలో, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పడుతుందో, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, పోలవరం ప్రాజెక్ట్ కి మరో కొత్త అవరోధం వచ్చినట్టు అయ్యిందని కేంద్ర మంత్రి అన్నారు.
ఉన్న టెండర్ ను రద్దు చేసి, మళ్ళీ కొత్త టెండర్ పిలిచి, ప్రాజెక్ట్ పనులు మొదలు పెడితే, ఇక ఇది ఎప్పటికి అవుతుందో చెప్పలేమని అన్నారు. మళ్ళీ టెండర్లు పిలవటం వల్ల, ఖర్చు బాగా పెరుగుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడూ పూర్తవుతుంది అని అందరూ కేంద్రాన్ని అడుగుతున్నారని, కాని పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర పరిధిలోనిది అని చెప్పారు. లోక్‌సభలో డ్యామ్ సేఫ్టీపై చర్చ సందర్భంగా షెకావత్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రకటన పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ ఇలాగే సాగదీస్తే కేంద్రానికి కూడా కలిసి వచ్చే అంశం అని, కేంద్రానికి కూడా డబ్బులు ఇచ్చే బాధ తప్పుతుందని అంటున్నారు. అలాగే, మరో ఆలోచన ప్రకారం, ఏపిలో బలపడాలి అనుకుంటున్న కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ ని తానే తీసుకుని, పనులు వేగవంతం చేస్తుందా అనే వాదన కూడా వస్తుంది. అయితే ఏది జరిగినా, ముందు ప్రాజెక్ట్ అయితే చాలు అని ఏపి ప్రజలు కోరుకుంటున్నారు.