మరో వారం, పది రోజుల్లో 100 కొడుతుంది అనుకున్న పెట్రోల్ కి, కొంచెం బ్రేక్ పడింది. పెట్రోల్ ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సామాన్యుడికి ఊరట కల్పించింది. ఇంధనాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని 1.50 మేర తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సైతం ఇంధన ధరలను రూ.1 మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యుడికి రూ.2.50 మేర ఉపశమనం కల్పిస్తున్నట్టయింది. సవరించిన పెట్రోల్ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై 15.33 మేర సుంకం వసూలు చేస్తోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్న పన్నులను రూ.2.50 మేర తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు జైట్లీ పేర్కొన్నారు. ఇటీవల ఇంధన ధరలు రోజూ పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడమే కారణమన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.10,500 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం బాటలో నడిస్తే ఇంధన ధరలు మరింత దిగి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించగా.. మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ...‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజల మీద అత్యధిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేలా ఈ సమావేశంలో తీర్మానించాం. ఈ సుంకంలో కేంద్రం రూ.1.5, ఆయిల్ కంపెనీలు రూ.1 తగ్గించనున్నాయి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. ప్రజలు తమ సంపాదనను కేవలం వీటిమీదే కాకుండా ఇతర నిత్యావసరాలపైనా వెచ్చించాలన్నదే మా ఉద్దేశం. ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4 శాతంలోపే ఉంది. దాన్ని తగ్గించే పనిలో ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు పెరుగుతుండటమే ఇందుకు కారణం. గతంలో కూడా ఇలా ధరలు పెరిగినప్పుడు రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం. దేశంలోని చమురు, మార్కెట్ కంపెనీలన్నీ ఈ తగ్గించిన సుంకాన్ని భరించే స్థాయిలోనే ఉన్నాయి. రాష్ట్రాలు వారి సామర్థ్యం మేరకు ఈ పన్నును తగ్గించాలి. ప్రతి రాష్ట్రం దీన్ని అమలు చేయాల్సిందిగా లేఖలు రాస్తాం’ అని తెలిపారు.