ప్రకృతి విపత్తులో అతలాకుతలమైన రాష్ట్రాన్ని సమాఖ్య స్ఫూర్తితో ఉదారంగా ఆర్థిక చేయూతనందించి అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కేరళీయుల కన్నీటి కష్టాలకు చలించి మానవతా హృదయంతో రూ.700 కోట్ల విరాళం అందజేసేందుకు ముందుకొచ్చిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)ని అడ్డుకొంటామని మోడీ ప్రభుత్వం సంకేతాలిస్తోంది. విపత్తు నుంచి తేరుకోవాలంటే ఆర్థిక, సాంకేతిక సేవలు కేరళకు అత్యవసరం. పునరావాస, పునిర్నిర్మాణ పనులకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తామని యుఎఇ ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యుఎఇతో కేరళకు ప్రత్యేక ఆత్మీయ సంబంధముందని, మళయాళీలు దూరంగా ఉన్న సొంత ఇంటిలా భావిస్తారని పేర్కొన్నారు.

kerala 22082018 2

అయితే ఈ సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించకపోవచ్చని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 'ఏ దేశమైనా సరే, విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని కేంద్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు. యుఎఇ ప్రకటించిన సాయం విషయంలోనూ ఇదే జరగవచ్చు' అని మంత్రివర్గ స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయంగా ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ప్రతిపాదన కానీ, ఆఫర్‌ కానీ తమ ముందుకు రాలేదని విదేశాంగమంత్రిత్వ శాఖ పేర్కొంది. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని, అవసరమైతేనే విదేశీ సాయం తీసుకోవాలని భారత్‌ గతంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయత్నాల ద్వారానే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయులు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నేరుగా ఆర్థిక సాయం చేయొచ్చు అని కేంద్రం తెలిపింది.

kerala 22082018 3

యూఏఈ, ఖతార్‌, మాల్దీవుల ప్రభుత్వాలు ఇప్పటికే ఆపన్న హస్తాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వరదలపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వరదలకు ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణానికి ఐక్యరాజ్య సమితి ఎయిడ్‌ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ప్రధాని మోదీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు. ఐక్య రాజ్య సమితి కూడా చేయూత అందించేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విదేశీ సాయాన్ని తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లిందని విజయన్‌ తెలిపారు. కాగా ఆయన కేంద్రాన్ని రూ.2600కోట్లు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రూ.600కోట్ల సాయం అందజేసింది. రాష్ట్రంలో వరదల కారణంగా రెండు వందల మందికి పైగా మరణించారు. దాదాపు 14లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read