హూద్ హూద్ తుఫాను ప్రళయం చేసిన విధ్వంసానికి, కొన్ని వేల కోట్ల ఆస్థి నష్టం జరిగింది. అయితే కేంద్రం మాత్రం కేవలం వెయ్య కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించి, కేవలం 600 కోట్లు ఇచ్చింది. మొన్న వచ్చిన తిత్లీకి కూడా ఇదే తీరు. కరువు సంబధిత డబ్బులు కూడా అరకోరగా విడుదల చేస్తూ కేంద్రం వచ్చింది. అయితే, ఇదంతా చంద్రబాబు మీద కోపంతో, ఆయన్ను సాధించాటానికి అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరూ అడగకుండానే, 200 కోట్లు ముందస్తుగా ఇచ్చి, ఏపి అధికార వర్గాలని కేంద్రం ఆశ్చర్యపరిచింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను తీవ్ర రూపం దాల్చుతోంది. తుపాను కారణంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను ప్రమాదం పొంచి ఉండటంతో బంగాళాఖాతం తీర ప్రాంతం కలిగిన నాలుగు రాష్ట్రాలకు ముందస్తు నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు రూ. 1086కోట్ల నిధులను ఎన్డీఆర్‌ఎఫ్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.200.25కోట్లు, ఒడిశాకు రూ.340.87కోట్లు, తమిళనాడుకు రూ. 309.37కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ. 233.50కోట్లు కేటాయించారు. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన ఉన్న తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరో 12 గంటల్లో పెనుతుపానుగా, మరో 24 గంటల్లో అతితీవ్ర పెనుతుపానుగా మారే అవకాశాలున్నట్లు వారు తెలిపారు. 4వ తేదీన ఈ పెను తుపాను ఒడిశా తీరం దాటి పశ్చిమబెంగాల్ దిశగా పయనిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. ఫొని ప్రభావంతో మంగళవారం ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.