కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. కడప ఉక్కు సెగ తగిలింది. కడప ఆర్‌అండ్‌బీ వద్ద అనంతకుమార్‌ను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కడప ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద మంత్రి అనంతకుమార్ హెగ్డే కారు ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు కారును చుట్టుముట్టడంతో మంత్రి అనంతకుమార్ కదలకుండా కారు లోపలే ఉండిపోయారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఓ మహిళా కార్యకర్త అనంతకుమార్ ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరారు.
దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. అనతకు ముందు అయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోనే కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే పేర్కొన్నారు. శనివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే యుద్దభూమిని వదలం.. అంటూ ఆయన అన్నారు.