ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ద్వివేది ఇవాళ్టి నుంచి సెలవులపై వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 15 వరకు ద్వివేది సెలవుల్లో ఉండనున్నారు. తిరిగి ఈ నెల 16న విధులకు హాజరుకానున్నారు. అయితే ఈయన ఈ నాలుగు రోజులు సెలవు పై వెళ్ళటం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈనెల 14న నిర్వహించే కేబినెట్ సమావేశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందో ఇవ్వదో తెలియని టైంలో, ఈయన సెలవు పై వెళ్ళటం చూస్తుంటే, ఎదో జరుగుతుంది అని అంటున్నారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం కనుక అనుమతి ఇవ్వకపోతే, తన పై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, ఇప్పటికే తన పై ఆరోపణలు చేస్తున్న అధికార పక్షం మరింత కఠినంగా విమర్శలు చేస్తారని, అందుకే ఆయన సెలవు పై వెళ్ళారానే ప్రచారం జరుగుతుంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడనుంది. సోమవారం దీని పై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందో ఇవ్వదో తెలిసిపోతుంది. ఈ నేపధ్యంలో ద్వివేది సెలవు పై వెళ్ళటం పై, అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎస్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశ అజెండాలోని అంశాలపై స్క్రీనింగ్ కమిటీ నివేదికను శుక్రవారం మధ్యాహ్నం నాటికి సిద్ధం చేశారు. ‘కమిటీ సభ్యులు రూపొందించిన నివేదిక’ను మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ ఉన్నతాధికారులు అందజేశారు. ఆ వెంటనే సీఈఓ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేబినెట్ అంశాలపై పంపిన నివేదికపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనున్నది.
సీఈసీ నిర్ణయం వెలువడేందుకు కనీసం 48 గంటల వ్యవధి కావలసి ఉంటుందని ద్వివేది వెల్లడించారు. సీఈసీ నుండి ఆదివారం సాయంత్రానికి లేదా, సోమవారం సాయంత్రానికి సమాధానం వచ్చే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ నివేదికలో ఏయే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు పూర్తయిన తరువాత ఫలితాల కోసం 41 రోజుల వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి రావడంతోనే ఇటువంటి అసందర్భమైన అంశాలు తెరమీదికి వస్తున్నాయని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఇటు ప్రభుత్వం, అటు కేంద్రంతో పాటు ఎలక్షన్ కమిషన్ మధ్యన నలిగిపోతున్నామని అంటున్నారు.