చంద్రన్న పెళ్లి కానుక వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ‘చంద్రన్న పెళ్లి కానుక’ జీవో, లోగోను ఆవిష్కరించారు. అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు తమ ఆడబిడ్డల పెళ్లిళ్లు భారంగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, బలహీలన వర్గాల వారికి రూ.50 వేలు, వికలాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ఇస్తామన్నారు.ఈ సందర్భంగా వివిధ జిల్లాల కల్యాణమిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.
''పేద వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి, వారి ఆదాయాన్ని పెంచి ఖర్చులను తగ్గించాలి. ముఖ్యంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ''చంద్రన్న పెళ్లి కానుక''ను ప్రారంభించాము'' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను బుధవారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తనకు 90 లక్షలకు పైగా తోబుట్టువులు ఉన్నారని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలపై తనకు అపార విశ్వాసం ఉందని అన్నారు. లక్షలాది మంది తోబుట్టువులతో అన్న, తమ్ముడు అని పిలిపించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని సీఎం అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించామని ఇప్పుడు పెళ్లికానుకను తీసుకొచ్చామని తెలిపారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు చేసే ఖర్చు ఎక్కువ ఉండేది కాదని, ఇప్పుడు అది పెరిగిపోయిందని పేర్కొన్నారు.
అందుకే పేదవారి ఇంట పెళ్లి భారం కాకూడదని రాష్ట్రంలో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే బాధ్యత తానే తీసుకుని శాశ్వతంగా అన్నగా మిగిలిపోవాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. చంద్రన్న పెళ్లి కానుకలో భాగంగా.. షెడ్యూల్ తెగలు, మైనారీటలకు రూ.50వేలు, షెడ్యూల్ కులాల వారందరికీ రూ.40వేలుగా నిర్ణయించారు. వెనుకబడిన వర్గాలకు రూ.35వేలు ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో కళ్యాణమిత్ర ద్వారా లక్ష పెళ్ళిళ్లు జరుగుతాయని అందుకు తాను గర్వపడుతున్నానని సీఎం అన్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఎస్సీలు, ఎస్టీలు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.75వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.50వేలు, వికలాంగులను పెళ్లిచేసుకున్నవారికి రూ.1 లక్ష ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.