చంద్రబాబు రాజనీతిజ్ఞతకు పెట్టింది పేరు. చట్టాలను గౌరవించడంలో ఎదురులేని వ్యక్తిత్వం. ప్రజాస్వామ్యయుత ప్రవర్తనకు నిలువుటద్దం. రాజ్యాంగబద్ధ వ్యవహారశైలికి ఓ నిదర్శనం. నలభై ఐదు సంవత్సరాలుగా క్రమశిక్షణాయుతమైన రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబుని అపరచాణక్యుడు అంటారు. అటువంటి చంద్రబాబు చండశాసనుడిగా మారాల్సిన పరిస్థితులు కల్పించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన నియంత పాలనతో చంద్రబాబులో పెనుమార్పులు తేవడానికి జగన్ దోహదపడ్డాడు. నాన్చుడు ధోరణి, పోనీలే వారి పాపాన వారే పోతారనుకునే చంద్రబాబుకి దూకుడు నేర్పాడు. మాటకు మాట. చర్యకు ప్రతిచర్య వుంటుందని హెచ్చరించే స్థాయి మొండిఘటంగా బాబుని తయారు చేశాడు. ఉద్యమమైనా, పోరాటమైనా ఒక దశలో ఆపేయడమో, తీవ్రత తగ్గించడమో చేసే చంద్రబాబుని పట్టువదలని విక్రమార్కుడిలా తయారయ్యేలా జగన్ రెడ్డి మూర్ఖ పాలనలో వేధింపులు తీర్చిదిద్దాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అధినేత పర్యటనలు పరిశీలిస్తే చంద్రబాబు చాణక్యుడే కాదు..చండశాసనుడు, పట్టువదలని విక్రమార్కుడు అని తేటతెల్లం చేస్తున్నాయి. మూడు రోజుల కుప్పం పర్యటనలో ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకుడు మళ్లీ చంద్రబాబులో కనిపించాడు. కుప్పం పర్యటనకు పార్టీ ప్రచార రథం, సౌండ్ వెహికిల్ ఉపయోగించడానికి అనుమతి లేదని స్వాధీనం చేసుకున్న పోలీసులు గుడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహన డ్రైవర్ లు, సహాయక సిబ్బంది ని అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గం వేలాది మంది పోలీసుల మొహరించారు. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజి ని తొలగించారు.
మైకు తీసుకుంటే నోటినే మైకు చేసుకున్నారు. వాహనాలు సీజ్ చేస్తే పాదాలనే వాహనాలుగా చేసుకుని నడకతో ప్రజల మధ్యకొచ్చారు. తన కుప్పం కుటుంబసభ్యులైన పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జిని నిరసిస్తూ నడిరోడ్డుపైనే బైఠాయించారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వేలాది మంది పోలీసులు, ఎక్కడికక్కడ ఆంక్షలు, బారికేడ్లతో అడ్డుకున్నా ఆగేది లేదు, తగ్గేది లేదంటూ మూడు రోజుల పర్యటనని దూకుడుగా కొనసాగించారు. తన ప్రచారవాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో స్వయంగా బస్సుపైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన నియోజకవర్గ ప్రజలని కలిసే హక్కు తనకి లేదా అంటూ తన వాయిస్‌గా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సర్కారు ప్రాయోజిత పోలీసు నిర్బంధాలను రాష్ట్రమంతటికీ అర్థమయ్యేలా వివరించారు. మూడు రోజుల పర్యటనలో పోలీసులపై తిరగబడాలని పిలుపునివ్వలేదు. ప్రతిపక్షనేతగా తన హక్కుల గురించి ప్రశ్నించారు. తనను అడ్డుకోవడానికి, తన పర్యటనలకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేని జగన్ చీకటి జీవో తెచ్చారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు.