జగన్ మోహన్ రెడ్డికి ప్రధాన ఓటు బ్యాంకుగా, దళితులు ఉన్నారు అనేది విశ్లేషకుల భావన. అయితే దీని పై చంద్రబాబు తనదైన మార్క్ తో తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోజిటివ్ ఫీల్ తో, వారిని తమ వైపు తిప్పుకోవటానికి, ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసారు. సార్వత్రిక ముందస్తు ఎన్నికల నేపథ్యంలో దళితుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టిడిపి. విపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు టీడీపీ ఎప్పికప్పుడు సరికొత్త పథకాలను రూపొందిస్తూ ఆయా సామాజికవర్గాల ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని దళిత ఓటర్లను ఆకర్షించేందుకు దళిత తేజం తెలుగుదేశం పేరుతో ముందడుగు కార్యక్రమానికి జవరి 26 రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేవరకు వారికి అండగా ఉండే బాధ్యతను స్వీకరిస్తానని ఆనాటి సభలో సీఎం హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్ హయాంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించినా, ఉద్యోగ రిజర్వేషన్ కల్పించింది తానేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అందరికీ చేయూతనిస్తాను, అన్ని విధాలా ఆదరిస్తాను, ఈ కార్య క్రమాన్ని స్ఫూర్తి దాయకంగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, శ్రేణులకు సీఎం ఆదేశించారు. ఇంటింటికీ టీడీపీ తరహాలో రాష్ట్రంలోని దళిత వాడలకు వెళ్లి వారితో మమేకం కావాలని చంద్రబాబు సూచించిన నేపద్యంలో, పార్టీలోని దళిత నాయకులు ఈ కార్యక్రమంలో ముందుండి నిర్వహించారు. గుంటూరు జిల్లాలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించగా ఈనెల 30న నెల్లూరు పట్టణంలో ముగింపు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల 20 లక్షల దళిత కుటుంబాల వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు దళిత నేతలు వెళ్లి వారి సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోగా ఎన్డీఏ నుండి టీడీపీ వైదొలగడం, సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం తదితర కార్యక్రమాలతో ముగింపు సభ వాయిదా పడుతూ వచ్చింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న కోటి దళిత కుటుంబాలకు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించని విధంగా రూ. 3 వేల కోట్లతో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు కరపత్రాలు ప్రచురించడంతో పాటు డాక్యుమెంటరీలను దళితవాడల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా దళితులకు ఇన్నోవా కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, బ్యాటరీ వాహనాలు, ఎన్టీఆర్ విద్యోన్నతిలో భాగంగా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ, ఎన్టీఆర్ విదేశీ విద్య, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తదితర పథకాల గురించి దళితవాడల్లో ప్రచారం నిర్వహించారు.

టీడీపీ హయాం లోనే దళితుల అభివృద్ధి జరిగిందని, టీడపీ ఉంటేనే దళితుల సంక్షేమం ఉంటుందని అభిప్రాయాన్ని కలుగ జేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా వైపు మొగ్గుచూపిన దళిత ఓటర్లను ఆకర్షించేందుకు పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా వస్తున్న బీసీ ఓట్లతో పాటు దళితుల ఓట్లను కూడా రానున్న ఎన్నికల్లో ఆకర్షించేందుకు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించి సఫలీకృతులయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగానే ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి, 11న జ్యోతీరావు ఫూలే జయంతి, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహించారు. ఈనేపద్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల భారీ విగ్రహ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అదే విధంగా దళిత నాయకత్వాన్ని పెంపొందించడంతో పాటు వారికి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి దళిత వాడల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీనికోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా యాప్ ను రూపొందించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. మొత్తానికి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలతో, పూర్తిగా కాకపోయినా, ఎంతో కొంత జగన్ ఓటు బ్యాంకు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని అంచనా వేస్తున్న జగన్, దీనికి విరుగుడుగా ఏమి చెయ్యాలో తెలియక, ఖంగారు పడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read