ఉత్తరాంధ్రలో ప్రజా వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసిపడింది. జగన్ అరాచక పాలనపై రాయలసీమ రగులుతోంది. ఆంధ్రాలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీనికి మూడు ప్రాంతాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. ఓటమికి వైసీపీ ఏ కారణాలైనా వెతుక్కోనీయండి. దొంగ ఓట్లు, డబ్బు, బెదిరింపులు, అధికారయంత్రాంగం వైసీపీకి పనిచేసినా గెలుపు దక్కలేదు. ఉమ్మడి 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. 175 నియోజకవర్గాలకి గానూ మూడు ప్రాంతాల్లోనూ 108 నియోజకవర్గాలలో ఎన్నికలూ మెజారిటీ ఎక్కువ తక్కువైనా ప్రభుత్వ వ్యతిరేక వైఖరినే వెల్లడించాయి. పట్టభద్రులు ఓటర్లుగా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాద్యాయులు ఉంటారు. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఈ వర్గాలు సంకోచించలేదు. ప్రజల మూడ్‌ని పసిగట్టిన మాజీ సీఎం చంద్రబాబు ప్రతీసభలో చెబుతున్నట్టు జగన్ పని అయిపోయింది అనే దానికి ఈ ఎన్నికలు నిదర్శనం. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర (నెల్లూరు, ప్రకాశం) రాయలసీమల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్రలో వైకాపా కంటే తెలుగుదేశానికి 14.39 శాతం ఓట్లు ఆధిక్యం రావడంతో వైసీపీ షాక్‌కి గురైంది. ఉత్తరాంధ్రకి రాజధాని తీసుకొస్తున్నామని, 2024 ఎన్నికలకి సైమీఫైనల్స్ అని వైసీపీ పెద్దలు చెప్పినా..ఓటర్లు తమ ఓటుతో మీ రాజధానీ వద్దు, మీరూ వద్దని చెప్పకనే చెప్పారు. ఉత్తరాంధ్రలో టిడిపికి 43.88 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 29.49 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. తూర్పు రాయలసీమలో వైసీపీకి 34.52 శాతం ఓట్లు పోలవగా, టిడిపికి 45.30శాతం వచ్చాయి. వైసీపీ కంటే 10.78 శాతం ఓట్ల ఆధిక్యం తెలుగుదేశం సాధించింది. వైసీపీ కంచుకోటగా భావించే పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. అంగ, అర్థ, అధికార బలమున్నా వైకాపాకు ప్రతికూల పవనాలు వీయడం..ముమ్మాటికీ ప్రజావ్యతిరేకతే అని స్పష్టం అవుతోంది.
చంద్రబాబు చెప్పిందే నిజం అయ్యింది... ఈ లెక్కలు చూస్తే జగన్ పని అయిపోయిందని అర్ధమవుతుంది
Advertisements