వరద ప్రభావిత ప్రారంటల్లో పర్యటన చేస్తున్న చంద్రబాబు, రెండో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాయలచెరువుకు చంద్రబాబు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రగిరి దగ్గర పోలీసులు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నానికి, చంద్రబాబుకు ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో చంద్రబాబు రాయలచెరువుకు వెళ్ళవద్దు అంటూ నోటీసుల్లో తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం ఆ నోటీసులు పట్టించుకోలేదు. రాయలచెరువుకు వెళ్లి తీరాలని, ముందుకు వెళ్ళాలని చెప్పారు. రాయలచెరువు దగ్గర పరిస్థితి ఎలా ఉందో సమీక్ష చేయాల్సిందే అని చంద్రబాబు తెలిపారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ రాయలచెరువుకు చేరుకుంది. రాయలచెరువు కట్ట తెగిన దగ్గరకు చంద్రబాబు చేరుకున్నారు. రాయలచెరువు పరిస్థితి, అక్కడ చేస్తున్న పని వివరాలు, అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ఎప్పటి లోగా గండి పూడ్చుతారో వివరాలు అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. అయితే చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం, చంద్రబాబు ఆ నోటీసులు పట్టించుకోక పోవటంతో, ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతవరణం నెలకొంది. పోలీసులు ఆయన్ను అడ్డుకుంటారు ఏమో అని అందరూ భావించారు. కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు.
అంతకు ముందు తిరుపతిలో మాట్లాడిన చంద్రబాబు, ప్రధానంగా పలు అంశాలు ప్రస్తావించారు. తాను పరిపాలనలో ఉన్నప్పుడు వచ్చిన హూద్ హూద్ తుఫాను తాను ఎలా పని చేసింది చెప్తూ, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎలా పని చేస్తుందో వివరించారు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించారు. మేము ఉన్నామని మనోధైర్యం ఇచ్చేందుకు వచ్చానని చంద్రబాబు అన్నారు.పెద్దఎత్తున వర్షాలు కురుస్తాయని ముందే తెలిపినా ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. ఈ సీఎం గాలిలో తిగుగుతున్నారని అన్నారు. వరదతో ప్రజలు అల్లాడుతుంటే అసెంబ్లీ వాయిదా వేసుకుని సీఎం రావాలి కదా అని అన్నారు. వరద సమస్యలపై నిర్ధిష్టమైన డిమాండ్లు పెడదాం అని, సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతాం అని చంద్రబాబు తెలిపారు. నిన్న చంద్రబాబ కడపలో పర్యటించారు. ఈ రోజు చిత్తూరులో చంద్రబాబు పర్యటిస్తున్నారు. రేపు చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారు.