చంద్రన్న భీమా పధకం అసంఘటిత కార్మికులకు ఒక వరంగా మారిన సంగతి తెలిసిందే... సామాన్య కూలి పనులు చేసుకునే కూలీలు ప్రమాదవసాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా, వారికి చంద్రన్న భీమా పధకం ద్వారా, మరణిస్తే 5 లక్షలు, పూర్తి వైకల్యానికి 5 లక్షలు, పాక్షిక వైకల్యానికి 2 లక్షల వరకు ఇస్తున్నారు... అలాగే సహజ మరణానికి కూడా 50 సంవత్సరాల లోపు వారికి 2 లక్షలు, 50 సంవత్సరాలు దాటిన వారికి 30 వేలు ఇస్తున్నారు... దీనికి ప్రతి సంవత్సరం కేవలం 15 రూపాయలు కడితే చాలు... అయితే, ఇప్పుడు ఈ చంద్రన్న భీమా అసంఘటిత కార్మికులకు మాత్రమే కాకుండా, ప్రజలందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి...
శాసనమండలిలో శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లో అసంఘటిత కార్మికుల, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి చంద్రన్న బీమా పథకానికి మండలి సభ్యుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తారు. ప్రధాన మంత్రి చంద్రన్న భీమా పథకంపై చర్చల్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు పదకొండు మంది ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను వెల్లిబుచ్చారు. ఒక వైపు చంద్రన్న భీమా పథకం నిరుపేదల పాలిట వరంగా మారిందని మండలి సభ్యులు ప్రశంసిస్తూనే మరో వైపు ఈ పథకాన్ని కేవలం అసంఘటిత కార్మికులకే పరిమితం చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్ లో పుట్టే ప్రతి ఒక్కరికి అమలు చేసేలా చిన్న చిన్న మార్పులు చెయ్యాలి అని సూచించారు. తొలుత చంద్రన్న పథకం ముఖ్య ఉద్దేశ్యాలను, లక్ష్యాలను, సాధించిన విజయాలను వివరించిన కార్మిక మంత్రి పితాని, చర్చల్లో భాగంగా మండలి సభ్యులు వెలిబుచ్చిన సూచనలను తప్పక పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, త్వరలో అందరికీ వర్తింపు అయ్యేలా ప్రధాన మంత్రి చంద్రన్న భీమా పథకాన్ని రూపొందిస్తామని హామి ఇవ్వడం జరిగింది.
2016-17 ఏడాదిలో 2.10 కోట్ల మంది చంద్రన్న బీమా పథకంలో చేరారని, ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 36 లక్షల మంది పెరిగి 2.46 కోట్ల మంది ఈ పథకంలో సభ్యులుగా చేరారన్నారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల బీమాదారుడు సహజ మరణం పొందితే మరణించిన 5 వేలు, మట్టి ఖర్చుకు, పెద్ద ఖర్మ రోజు రూ.25 వేలను అతని కుటుంబ సభ్యులకు ఇస్తారన్నారు. అలాగే ఆకస్మిక ప్రమాదాలకు గురై మరణించిన బీమా దారుడి కుటుంబానికి 30 వేలతో పాటు, 5 లక్షల నగదును ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మరణించిన వారి కుటుంబంలో ఇద్దరు విద్యార్ధుల చదువులకు ఒక్కోక్కరికి రూ.1.200 చొప్పన స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మరణించిన 6,030 మందిచంద్రన్న భీమా దారుల కుటుంబాలకు క్లెయిమ్ లు అందచేయ్యటం జరిగింది అని మంత్రి చెప్పారు. అలాగే 12,85,000 వేల మంది విద్యార్ధులకు స్కాలర్షిప్స్ ఇస్తున్నామన్నారు.