జీవితం ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది అని ఒక సినిమా డైలాగ్ ఉంది... అది నిజ జీవితంలో, పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డైలాగ్... ఒక పద్ధతిగా జీవితం బ్రతకకుండా, డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, ఏ రోజుకైనా బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. దానికి మరో ఉదాహరణ ఈ సంఘటన... ఈ ఫొటోలో... కటకటాల వెనుక దీనంగా నిల్చున్నది ఎవరో ఊహించారా? ‘సమరసింహా రెడ్డి’ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా నిర్మాతగా ఒక వెలుగు వెలిగి... ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా నెగ్గిన చెంగల వెంకట్రావు! హత్యకేసులో శిక్షపడిన ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మలేరియా బాధితులను పరామర్శించేందుకు వచ్చిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్... అక్కడే ఖైదీలు చికిత్స పొందే విభాగాన్ని పరిశీలించారు. అందరు ఖైదీల్లాగానే చెంగలను పలకరించారు. అయితే... ఆయన సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అని తెలుసుకుని ఒకింత ఆశ్చర్యపోయారు. చెంగల వెంకట్రావు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేసి పరాజయం పాలయ్యారు.
2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీచ్ మినరల్స్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఒక మత్సకారుడు మరణించాడు. ఇందుకు చెంగల వెంకట్రావు,ఆయన మద్దతుదారులే కారణమంటూ రెండో వర్గం కేసు పెట్టింది. దాదాపు పదేళ్లపాటు కేసు విచారణ కొనసాగింది. చివరకు గత ఏడాది మే 24న అనకాపల్లి జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు చెంగల సహా 21 మందికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. చెంగల జైలుకు వెళ్లక తప్పలేదు. ఓడలు బండ్లు కావడమంటే ఇదే..