ఎన్నికలు ఏడాది ఉండగానే, ఇప్పటి నుంచి ప్రలోభాలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు. ఏకంగా ఎమ్మల్యేలే ఈ పని స్వయానా చెయ్యటంతో అందరూ షాక్ తిన్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఈ స్కాం బయట పెట్టింది, అక్కడి ప్రజలే. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మహిళా సంఘాలను ప్రభావితం చేసేలా, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్కెచ్ వేసాడు. ఇందుకు ఆయన భార్య సహాయం తీసుకుని, పని కానిచ్చాడు. కాని, మహిళా సంఘాలు ఎదురు తిరగటంతో, వీరి బండారం బయట పడింది. మహిళా గ్రూపుల సమన్వయం చేసే సంఘమిత్రల బ్యాంకు ఖాతాల్లోకి పది రోజుల క్రితమే రూ.2 వేలు చొప్పున జమయ్యాయి.
అయితే, ఈ విషయం తెలుసుకుని, 36 మంది సంఘమిత్రలు బుధవారం ఎం.ఆర్.పల్లిలోని వెలుగు కార్యాలయంలో సమావేశమై ఈ మొత్తాన్ని తీసుకోవద్దంటూ తీర్మానించారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లోని సంఘమిత్రలు సైతం తమ ఖాతాల్లో పడిన డబ్బును వాపసు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నియోజకవర్గంలోని మొత్తం డ్వాక్రా సంఘాలకు కలిపి 210 వరకు సంఘమిత్రలు ఉన్నారు. ఒక్కో సంఘమిత్ర కింద 200 మంది మహిళలు గ్రూపుల్లో ఉంటారు. ఒక్కో గ్రూపునకు ఒక్కో బ్యాంకు ఖాతాతో పాటు.. అన్నీ సంఘాలకు కలిపి ఉమ్మడిగా ఓ ఖాతా ఉంటుంది. ఇటీవల 175 మంది సంఘమిత్రల ఖాతాల్లో ఎమ్మెల్యే భార్య లక్ష్మికాంత పేరిట ఉన్న కెనరా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు జమయ్యాయి.
గమనించిన సంఘమిత్రల్లో కొందరు ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంఘమిత్రలకు రూ.3 వేల చొప్పున గౌరవవేతనం ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే ఎమ్మెల్యే భార్య వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు జమ కావడాన్ని వారు తీవ్రంగా పరిగణించారు. ఇందులో రాజకీయ కోణం ఉందన్న సంగతి స్పష్టమవుతోందని, అప్రమత్తమై సంఘమిత్రలకు పలు సూచనలు చేశామని అధికారులు చెబుతున్నారు. వీరికి సంఘమిత్రల వ్యక్తిగత ఖాతాల వివరాలు ఎలా తెలిశాయో ఆరా తీస్తున్నారు. ‘గత నెలలో ఎమ్మెల్యే చెవిరెడ్డి సమావేశానికి కొంతమంది సంఘమిత్రలను పిలిపించి, జగన్ అధికా రంలోకి వస్తే రూ.10 వేలు ఇస్తా మని, అప్పటిదాకా ప్రతి నెలా రూ.2 వేలు పసుపు, కుంకుమలకు ఇస్తానని చెప్పారు. దీనికి మేము సమ్మ తించలేదు’ అని తిరుపతి రూరల్ మండల సంఘమిత్రలు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామాల్లోకి తీసుకెళ్లేది తామేనని చెప్పారు. ప్రభుత్వం గౌరవవేతనం ఎంత ఇచ్చినా ఫర్వాలేదని, ఇలాంటి డబ్బులు తమకొద్దన్నారు. ఆ రూ.2 వేలు నగదు లక్ష్మీకాంతమ్మ పేరుతో మా అకౌంట్‌లోకి ఎలా జమ అయిందో తెలియదన్నారు.