తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో దొంగ ఓట్ల కలకలంతో అధికార పార్టీ నేతల తీరుపై ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, నిరసనలకు దిగాయి. తిరుపతిలోని అన్ని పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్లు పోలయ్యాయంటూ టిడిపి, బిజెపి పార్టీల అభ్యర్థులు నిరసనలకు దిగారు. పోలీస్ స్టేషన్ ముందు అధికార పార్టీ తీరు, పోలీసుల వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తిరుపతిలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మను అరెస్టు చేసి ఎమ్మారపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలాగే టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎఆర్ కన్వెన్షన్ హాలులో దొంగ ఓట్లు వేసేందుకు బస్సులు, ఇతరవాహనాల్లో తరలి వచ్చారని, అక్కడికెళ్లి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. దొంగ ఓట్లు భారీగా పోలవడంతో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పోలీసులు గానీ, పోలింగ్ విధుల్లో ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు.
ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని, దొంగ ఓటర్లను తరలించిన వైసిపి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని చంద్రబాబు ప్రకటనలో కోరారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు, పీలేరు, పూతలపట్టు నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను దాదాపు 10 వేలమందికి పైగా శనివారం ఉదయానికల్లా ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సులలో, జీపులు, టాక్సీలలో తిరుపతికి చేరుకున్నారు. వారందరినీ కళ్యాణ మండపాలు, లాడ్జీలలో పెట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 వేల మంది నుండి 3 వేల మందిని దొంగ ఓట్లు వేసేందుకు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం నుంచి, విప్ చెవిరెడ్డిదిగా చెప్తున్న ఆడియో టీవీ చానల్స్ వస్తుంది. దొంగ ఓట్ల గురించి మాట్లాడుకుంటూ, వేరే ప్రాంతం నుంచి ఇప్పటికిప్పుడు రమ్మంటే కష్టం అని, 400 దొంగ ఓట్లు మేము వేపిస్తాం అంటూ చెవిరెడ్డిదిగా చెప్తున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఆయన దాని పై స్పందించలేదు.