చిత్తూరు జిల్లాలోనే అది అత్యంత సున్నితమైన నియోజకవర్గం.. రాష్ట్రంలో రీపోలింగ్ పూర్తయినా 5 బూత్‌లలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రాంతం... అదే చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన అనుచరుల కోసం ఓ యాత్ర చేపట్టారు. తన నియోజకవర్గ కేంద్రం చంద్రగిరి నుంచి షిర్డీకి ప్రత్యేక రైలును బుక్ చేయించారు. అందులో మందు, విందులాంటి సకల సౌకర్యాలూ కల్పించారు. దీంతో ఆ రైలులో ఆయన అనుచరులు చేసిన హంగామా, విచ్చలవిడిగా మద్యం సేవించి, పేకాట ఆడుతూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 23 బోగీలతో ఉన్న ప్రత్యేక రైలు గురువారం ఉదయం 10.30కు తిరుపతి, రేణిగుంట మీదుగా షిర్డీకి బయలుదేరింది.
చెవిరెడ్డి ఆ రైలులో సకల సౌకర్యాలు కల్పించారు. దిగగానే వసతికి అన్నీ ఏర్పాట్లు చేశారు. మద్యం, ఇతర సదుపాయాలన్నీ రైలులోనే అందేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక బోగీ ఏర్పాటు చేశారు. రైలు ఎక్కిన దగ్గర్నుంచి, మళ్లీ తిరిగి వచ్చే వరకు ఖర్చులన్నీ చెవిరెడ్డివే. చంద్రగిరి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కిన వారికి గురువారం ఉదయం స్టేషన్ బయటే అల్పాహారం, నీరు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి బయలుదేరిన రైలు రేణిగుంటలో సుమారు అరగంటసేపు ఆగింది. వైకాపా నాయకులు, కార్యకర్తలు పరుగున స్టేషన్ బయటకు వెళ్లి మద్యం తెచ్చుకున్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో కార్యకర్తలు స్టేషన్ బయటకు, లోపలికి పరుగులు పెట్టడంతో చుట్టుపక్కలవారు ఆందోళన చెందారు.
కొందరు రైలులో, మరికొందరు ప్లాట్‌ఫాంపైనే విచ్చలవిడిగా తాగడంతో ఇతర ప్రయాణికులు నివ్వెరపోయారు. జీఆర్పీ పోలీసులు సైతం వారిని కనీసం వారించే ప్రయత్నం చేయలేదు. పేకాట కూడా జోరుగా సాగింది. ప్రతి బోగీలోనూ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు సాగాయి. బెట్టింగులు కూడా భారీ ఎత్తున సాగాయి. అందరితో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం షిర్డీకి వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో విరమించుకున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో సర్పంచిలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, బూత్ కన్వీనర్, మండల కన్వీనర్లు యాత్రలో పాల్గొన్నారు.