రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఢిల్లీ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం బుధవారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం గం.6.25 ని.లకు షికాగో చేరుకున్నప్పుడు తెలుగు సంఘాల నుంచి ఘనస్వాగతం లభించింది. ముందుగా అమెరికాకు చెందిన జిటన్ సహా 80 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తరువాత చికాగో స్టేట్ యూనివర్శిటీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చికాగో స్టేట్ యూనివర్శిటీ చైర్మన్, డిపార్టుమెంట్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ కాంప్యూటర్ సైన్సస్ ప్రొఫెసర్ రోహన్ అత్తెలె సమావేశమయ్యారు. యూనివర్శిటీ 150వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీ (స్నాతకోత్సవం) లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఏపీలోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని ప్రొఫెసర్ రోహన్ ప్రతిపాదించారు.
చంద్రబాబును కలసిన తానా ప్రతినిధులు: అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తానా ప్రతినిధులు కలుసుకున్నారు . అమెరికాలో 20 నగరాలలో 5కె రన్ నిర్వహిస్తున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. 5కె రన్ కార్యక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. 2 మిలియన్ డాలర్లతో అమరావతిలో తానా భవన్ నిర్మించేందుకు తానా ఆసక్తి. అందుకు అవసరమైన స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును తానా ప్రతినిధులు అభ్యర్ధించారు. ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీఇచ్చారు.