రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను కోరారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిని ఆయన సమీక్షించారు.
కోటి ఎకరాలలో ఉద్యాన పంటల సాగు అంటే ఆషామాషీ కాదని, అత్యధిక ఉత్పాదన ద్వారా అధికాదాయం సాధించాలన్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉద్యాన రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పంట వేయక ముందునుంచి పంట దిగుబడి వచ్చాక కూడా ఏమేం చేయాలో ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. అధికోత్పాదనకు ఎక్కడా రాజీ వద్దని, కరవు నివారణకు ముందు జాగ్రత్త చర్యలతో సంసిద్ధతతో ఉండాలన్నారు.
ఎగుమతికి అనువైన నాణ్యమైన ఉత్పత్తులు కావాలని, ఉన్న ఉన్న ఆదాయానికన్నా 20 రెట్లు అధికాదాయం వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని, అధిక దిగుబడులు సాధించేందుకు ప్రపంచంలోని ఉత్తమ సేద్యపు పద్ధతులను తీసుకురావాలని కోరారు.
ఉద్యాన రైతులు అధిక దిగుబడులతో ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు వారికి ప్రోత్సహించేలా చూడాలని, ఉద్యాన పంట ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని, మిరప, పసుపు, నువ్వుల పంట సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో 39.67 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని, 259.85 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. మేలిమి పద్ధతులను అనుసరిస్తేనే అధికోత్పత్తి సాధ్యమన్నారు. పంట దిగుబడి, ఎగుమతులు, శుద్ధిప్రక్రియను క్లస్టర్ల వారీగా ప్రణాళికా బద్ధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.క్లస్టర్ల వారీ విభజనతో ఒక్కో క్లస్టర్ లో ఒక్కో పంటను సాగు చేయవచ్చన్నారు.
ఆక్వారంగానికే ఏపీ తలమానికం
అధికాదాయానికి మత్స్యశాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ మత్స్యరంగం వృద్ధి రేటుకు, రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడుతోందని, అయితే కాలుష్యం పై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగానికి ప్రపంచానికే తలమానికంగా నిలవాలని అన్నారు.