ఓవైపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు భారీ ఉక్కు పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనాకు చెందిన సంస్థ ఒకటి వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంగళవారం ఉండవల్లిలోని ‘ప్రజావేదిక’లో సమావేశమయ్యారు. ఏడాదికి 7 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇందుకోసం ఏదైనా పోర్టు సమీపంలో రెండు వేల ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు.
చైనా-ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టు కింద తాము పెట్టుబడులు పెట్టదలిచామని చైనాకు చెందిన స్టీల్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆసియా దేశాలతో వాణిజ్యం, భారతదేశంలో స్టీల్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయించామని, ఇందుకు అత్యంత అనుకూల ప్రాంతమైనందునే ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నామని వివరించారు. ముడి ఇనుము, బొగ్గు గనులకు సంబంధించి తాము ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నామని, వివిధ దేశాల్లోని పలు సంస్థలతో కూడా తమకు భాగస్వామ్యం ఉందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికతో మళ్లీ రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు ఉంటాయని, అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్ పాల్గొన్నారు. మరో పక్క కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చెయ్యనున్న సంగతి తెలిసిందే.