రామతీర్ధం ఘటన పై అన్ని వర్గాల ప్రజలు స్పందిస్తున్నారు. చినజీయర్ స్వామి ఒక ఆధ్యత్మిక ప్రసంగంలో, ప్రభుత్వం ఏమి చేస్తుందో, రక్షణ వ్యవస్థ ఏమి చేస్తుందో అంటూ నిర్వేదం వ్యక్తం చేసారు. అంతే కాదు, ఇలాంటి ఘటనలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజానిది అంటూ, హితవుపలికారు. ఆయన మాటలు యధాతధంగా... "రెండు రోజుల క్రితం, విజయనగరం జిల్లా రామతీర్ధంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ రాముడు విగ్రహం తల పెకలించారు. విగ్రహాన్ని ఎవరో వెళ్లి, తల తీసి వెళ్లి, పక్కన ఎక్కడో పడేసారు. వెతికితే అక్కడే ఎక్కడో దొరికింది తల. ఏమి చేయాలో ఇప్పుడు తెలియటం లేదు. కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. చూడాల్సిన రక్షణ వ్యవస్థ ఏమైపోయిందో తెలియదు. దాని కోసం పెద్ద డిపార్టుమెంటు ఉంది. అందులో మనుషులు ఉన్నారు. వాళ్ళంతా దాని కోసమే ఉన్నారు. దాని గురించే బ్రతుకుతున్నారు. జీతాలు తీసుకుంటున్నారు. బ్రతుకులు అంతా అక్కడ నుంచే బ్రతుకుతున్నారు. మరి ఆ వ్యవస్థ అంతా నిద్రపోయిందో ఏమైందో మనకు తెలియదు. ఏమి చేస్తాం అండి, దేవుడే దేవుడిని రక్షించుకోలేక పోతే ఏమి చేస్తాం అండి. ఇలా అంటారు చాలా మంది, మాటలు అనటానికి. కానీ వాస్తవం అది కాదు. దేవుడు ఆ విగ్రహ రూపంలోకి ఎందుకు వచ్చారు అంటే, కదులుతూ వస్తే, కదిలి వెళ్ళిపోయే స్థితి ప్రతి ప్రాణికి ఉంటుంది, కదా. పుట్టిన ప్రతి ప్రాణికి వెళ్ళక తప్పదు కదా. కదిలే ప్రతి ప్రాణి పోతూ ఉంటుంది కనుక, విగ్రహ రూపంలో కదలకుండా ఉండేటట్టు మన ముందుకు వస్తే, శాశ్వతంగా స్థిరంగా మన ముందు ఉండేట్టు, దేవుడు అలా ఉన్నాడు. "
"మన మధ్య దేవుడు ఉండాలని, మన అవసరాలు తీర్చాలని కోరుకుంటాం. వస్తాడు ఆయన. మరి మన కోసం వచ్చిన దేవుడుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అండి ? ఏమండి మీరు మీ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తే, ఒక అతిధి వచ్చాడు అనుకోండి, అతనికి అన్నీ సక్రమంగా ఉండేట్టు చేసుకునే బాధ్యత ఎవిరిది ? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావ్, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావ్ అనేలా ఉంది. ఏది చేసినా నాకే, అనేది మన బ్రతుకు. మనం కోరుకుంటే, మన మధ్య ఉండే దేవుడు విగ్రహ రూపంలో వస్తే, దానికి తగ్గ రక్షణ వ్యవస్థ, చూసుకునే బాధ్యత మనది. దేవుడిది కాదు. అలా బాధ్యత తీసుకో లేని వాడు, దండనీయుడు. దేవుడు మన కోసం వస్తే, నీకే దాని మీద శ్రద్ధ లేకపోతే, ఆయన ఏమి చేస్తాడు. అంత చేత, ఆయనకు చేతకాక కాదు. ఆయన ఏమి చెయ్యాలో అది చేస్తాడు. నీతో పాటు, ఈ సమాజం బాధ్యత ఉండాలి. అలా ఆ దేవుడిని చూసుకోవాల్సిన బాధ్యత, నీది, ఈ సమాజానిది" అంటూ చినజీయర్ స్వామి తన ప్రసంగంలో చెప్పారు.