ఎప్పుడూ ఆగ్రహంతో అది చేసారు, ఇది చేసారు అని వార్తల్లో ఉండే టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నిరసన తెలపటం ఏంటి అనుకుంటున్నారా ? ఈ ఘటన గుంటూరు జిల్లా, కాజా టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఆయన ఫ్యామిలీతో సహా, కార్ లో తిరుపతి వెళ్లి, రిటర్న్ వస్తూ ఉండగా, కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది చింతమనేని కారును ఆపారు. ఏ టోల్ ప్లాజా వద్ద అయినా, కార్ ఆపగానే, ఎమ్మెల్యే అని చెప్పగానే కార్ కి దారి ఇస్తారు. ఎమ్మెల్యేలకు, టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉండటమే దానికి కారణం. అయితే, గుంటూరు జిల్లాలో అదీ రాజధానికి అత్యంత దగ్గరగా ఉండే కాజా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం, ఎమ్మెల్యే చింతమనేని వాహనాన్ని కదలనివ్వలేదు.
తాను ఎమ్మెల్యేను అని స్వయంగా చింతమనేని చెప్పినా అక్కడి సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. తాను ఎమ్మెల్యేను అనీ, తనకు టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని గుర్తుచేశారు. అయితే సిబ్బంది మాత్రం డబ్బులు చెల్లించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. మీరు ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ మాట్లాడటంతో, చింతమనేని సహనం కోల్పోయారు. టోల్ ప్లాజా సిబ్బంది చర్యలకు నిరసనగా, తన కారును టోల్ గేట్ వద్ద వదిలేసి అటుగా వెళుతున్న బస్సు ఎక్కి, దెందులూరు ప్రయాణం అయ్యారు. ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని మంగళగిరి పోలీసులకు తెలియచేసారు. ఎమ్మెల్యే అని చెప్పినా, గన్ మెన్లు పక్కన ఉన్నా, తనను ఎమ్మెల్యే అని నిరూపించుకోండి అంటూ అక్కడ సిబ్బంది చెప్పటాన్ని, తప్పుబట్టారు.
కావాలని ఇలా చేసారా, రెచ్చగొట్టి ఏదైనా ఇష్యూ చెయ్యటానికి, ఇలా చేసారా అనే అనుమానం వ్యక్తం చేసారు. నిత్యం ఆ రూట్ లో ఏంటో మంది ఎమ్మల్యేలు వస్తారని, సిబ్బందికి ఎవరు ఏంటో తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా, టోల్ ప్లాజా సిబ్బంది పై తన సహజమైన దూకుడు ప్రదర్శించకుండా, హుందాగా నిరసన తెలపటం మంచి పరిణామం. అయితే ఇంకా ఎమ్మెల్యే చింతమనేని కారు టోల్ ప్లాజా వద్దే ఉంది. ఇలనాటి సంఘటనలు తాను పట్టించుకోను అని, కాని అక్కడ వాళ్ళ వాలకం చూస్తుంటే, తనను కావాలని, అక్కడ సిబ్బంది అవమానించారని, జరిగిన అవమానానికి బాధ్యలు అయిన వారి మీద, ఏ చర్యలు తీసుకున్నారో చెప్తేనే, అక్కడ నుంచి వాహనం తీసుకువెళ్తానని, చింతమనేని పోలీసులకి చెప్పారు.