ఎన్ని ఇబ్బందులైనా పడి తమ పిల్లల్ని ప్రయివేట్ పాఠశాలలో చదివించాలని పేదవారు సైతం ఆలోచిస్తారు. ఫీజులు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అక్కడైతేనే చదువు బాగా చెబుతారని వాళ్ళనుకుంటారు. ఉచితంగా చెబుతున్నాం రమ్మన్నా ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పరిస్థితులు మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లలో పోటీపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉందనే వార్తలు వింటుంటే ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మరింత నమ్మకం పెంచటానికి, ఏకంగా ఒక ఎమ్మల్యే, తన కుమారుడుని, ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాడు. అది కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి. ప్రజల్లో నమ్మకం కలిగించటం కోసం, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు. ఇప్పుడీ జాబితాలోకి తెదేపా నేత, చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ చేరారు. తన కుమారుడిని దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చేర్పించి ఆదర్శ నేత అయ్యారు. ఒక ఎమ్మల్యే తన కొడుకుని, ప్రభుత్వ పాఠశాలకు పంపించటంతో, ప్రజల్లో కూడా నమ్మకం పెరిగింది.
ప్రజలకు ప్రభుత్వ స్కూల్స్ లో చేరండి అని చెప్పే ముందు, మన పిల్లలు కూడా ఇక్కడే చదవాలి కదా, అప్పుడే మనకు ప్రజలకు చెప్పే పరిస్థితిలో ఉంటాం అంటున్నారు చింతమనేని ప్రభాకర్. మిగిలిన ఎమ్మల్యేలు, నేతలు, అధికారులు కూడా, ఇలాగే చెయ్యాలని, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ప్రైవేటు స్కూల్స్ కు తీసిపోని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, ప్రజల్లో పోయిన ఆ నమ్మకాన్ని, తిరిగి తీసుకురావాలి అంటున్నారు. ప్రతి సందర్భంలో, ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే చింతమనేని, ఈసారి మాత్రం, ఒక గొప్ప ఆదర్శ నిర్ణయం తీసుకుని, ప్రజలకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు.