మెగాస్టార్ చిరంజీవి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కీలక వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లోని యోధ లైఫ్లైన్ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో, ఉపరాస్ట్రపతి వెంకయ్యతో పాటుగా, చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రసంగంలో భగంగా చిరంజీవి మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి వెంకయ్య పై, పొగడ్తల వర్షం కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలుగుదానానికే నిర్వచనం అని చిరంజీవి అన్నారు. క్రమశిక్షణకు మారు పేరు మన వెంకయ్య నాయుడు అని చిరంజీవి చెప్తూ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఎన్నో సేవలు ఈ దేశానికి అందించారని అన్నారు. దివంగత నందమూరి తారక రామారావు గారి ద్వారా, తెలుగువారికి ప్రపంచ స్థాయి ఖ్యాతి దక్కిందని, గుర్తింపు లభించిందని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి ద్వారా తెలుగువారి నిర్వచనం, నిలువెత్తు నిర్వచనం అని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగానే చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు వారు మరింత గర్వించేలా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు, త్వరలోనే రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి, వెంకయ్య నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటంతో, అక్కడ ఉన్న వారు అంతా చిరంజీవి మాటలకు సమర్ధిస్తూ, చప్పట్లు కొట్టారు.
అయితే తరువాత మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి మాటలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవి తనకు రాష్ట్రపతి పదవి రావాలని కోరుకుంటున్నారని, ఆయన కోరుకున్నాట్టు రాష్ట్రపతి పదవి నాకు వస్తుందని అనుకోవటం లేదని అన్నారు. ప్రస్తుతం రాజకీయం అంత బాగోలేదని వెంకయ్య తన మనసులో మాట చెప్తూ, ఇక ఏ పదవి వద్దు అనే విధంగా స్పందించారు. ప్రస్తుత రాజకీయాల తీరు చూస్తే బాధ వేస్తుందని, ఈ రాజకీయాల పై ఎక్కువ మాట్లాడటం తనకు ఇష్టం లేదని, వెంకయ్య సూటిగా చెప్పేసారు. చిరంజీవి కూడా రాజకీయాల నుంచి తప్పుకుని మంచి పని చేసారని, వెంకయ్య అన్నారు. అయితే చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు అంటూ, ఈ మధ్య ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి మాట్లాడిన మాటలు, దానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇచ్చిన సమాధానం, రాజకీయాలు ఇప్పుడు బాగోలేదు అని చెప్పిన తీరు, ఈ మొత్తం వ్యవహారం పై, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.