ఒక పక్క అమరావతిలో రైతులు, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలుతో సహా , నాలుగు రోజుల నుంచి రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తుంటే, వారి సమస్యలు గురించి, ప్రభుత్వం వైపు నుంచి పట్టించుకునే నాధుడు కనిపించటం లేదు. అయినా వారు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధాని కోసం, భూములు ఇస్తే, ఇప్పుడు తమని మోసం చేస్తున్నారని, చంద్రబాబు మీద కక్షతో తమను నాశనం చేస్తున్నారని, అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో వరదలు వస్తాయని విష ప్రచారం చేసి, ఎప్పుడూ వరదలు రాని అమరావతి పై విషం చిమ్మి, వరదలు వచ్చి మునిగిపోయిన కర్నూల్ లో ఒక రాజధాని, తుఫానులు, సునామీలు వచ్చే విశాఖపట్నంలో ఇంకో రాజధాని పెట్టారని, మమ్మల్ని నాశనం చేసారని వారు వాపోతున్నారు. అయితే వీరి తరుపున వివిధ రాజకీయ పార్టీలు కూడా పోరాడుతున్నాయి. ముఖ్యంగా జనసేన కూడా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ జగన్ పై పోరాడుతుంటే, అన్నయ్య చిరంజీవి మాత్రం, జై జగన్ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు పై జగన్ చేసిన వ్యాఖ్యలు, జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక పై, మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ఒక బహిరంగ లేఖ విడుదల చేసారు. దాదాపుగా 5 ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి, తన లెటర్ హెడ్ పై ఇండిపెండెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ పేరు లేకుండా చూసుకుని, జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ, ఒక బహిరంగ లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి, మూడు రాజధానుల పై తీసుకున్న నిర్ణయం అద్భుతం, అమోఘం అంటూ, పొగుడుతూ లేఖ రాసారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని, చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మూడు రాజధానుల అంశాన్ని అందరూ స్వాగతించాలని చిరంజీవి పేర్కొన్నారు.
గతంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని, మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇప్పుడు కూడా అమరావతినే అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని చిరంజీవి అన్నారు, అయితే ఇక్కడ జరుగుతుంది పాలనా వికేంద్రీకరణ అయితే, చిరంజీవి మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడటం గమనార్హం. అయితే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన తరువాత, అమ్మడు కుమ్ముడు అంటూ, 150వ సినిమా చేసారు. తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు. అయితే ఈ 5 ఏళ్ళలో పొలిటికల్ ప్రోగ్రాం ఏదైనా చేసారు అంటే, మొన్న జగన్ ని కలిసి, భోజనం చెయ్యటం, ఈ రోజు జగన్ ని పొగుడుతూ లేఖ రాయటం. మరి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ? ఈ అభిప్రాయం పై తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమంటారు ? వేచి చూడాల్సిందే.