సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. తన పార్టీకి వచ్చిన 18 సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చి, రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, ఆ సమయంలో చిరంజీవి పై సీమంద్ర ప్రాంతంలో విమర్శలు రావంతో, ఇక రాజకీయాలకు దూరం జరిగి, సినిమాల వైపు వెళ్ళిపోయారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ, 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి... ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్ ‘సైరా’లో నటిస్తున్నారు.
ఇటీవల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా, దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఆ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారానికి రమ్మని పిలిచినా, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా, చిరంజీవి దూరం వెళ్ళిపోయారు.
ఈయన రాజ్యసభ సభ్యత్వం కూడా మూడు నెలల కిందే ముగిసిపోవడంతో ఇప్పుడు ఈయన కేవలం కాంగ్రెస్ సభ్యుడు మాత్రమే. అందుకే పదవి లేకుండా, కేవలం సభ్యుడిగా ఉండటం చిరంజీవికి నామోషి అని చెప్తున్నారు. అన్నీ కుదిర్తే జనసేన వైపు వెళ్లి అక్కడ తమ్ముడికి అండగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి కోసం, గౌరవ అధ్యక్ష పదవి కూడా రెడీ చేసారని, సరైన సందర్భంలో చిరంజీవి వచ్చి, తమ్ముడు పార్టీలో చేరటమే మిగిలిందని తెలుస్తుంది. అందుకే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రతీ మీటింగులోనూ చిరు గురించి ప్రత్యేకంగా ప్రస్థావిస్తున్నాడు. త్వరలోనే ప్రజా రాజ్యం - 2 ఆవిష్కృతం కాబోతుంది.