రెండు రోజుల క్రితం బెజవాడలో బీజేపీ నేతలు, ఆగ్రిగోల్ద్ పేరుతొ చేసిన హడావిడి చూసాం. అందులో అన్నీ అవాస్తవాలు మాట్లాడుతూ, అందరినీ తప్పుదోవ పట్టించారు. ఒక పక్క కోర్ట్ లో కేసు ఉన్నా, అన్నీ అబద్ధాలు చెప్పారు. దీంతో, ఈ కేసు విచారణ చేస్తున్న సిఐడి స్పందించింది. అగ్రిగోల్డ్ మోసాలపై అయిదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. అగ్రిగోల్డ్‌పై వస్తున్న ఆరోపణలకు, దర్యాప్తునకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంస్థ ఆస్తులను తక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణల పై మాట్లాడుతూ విమర్శించే వారికి ఆధారం ఉండాలని, సబ్‌రిజిస్ట్రార్ విలువ ప్రకారమే ఆస్తులను చూపామని వివరించారు.
అంతా నిబంధనల ప్రకారం చేస్తున్నామని చెప్పారు. ‘‘ఈ సంస్థ మోసాలపై నమోదైన 14 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశాం. మరో కేసులో వారంలో అభియోగపత్రం దాఖలు చేస్తాం. ఈ సంస్థపై ఐదు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బాధితుల వివరాల సేకరణ పూర్తయింది. తెలంగాణ, కర్ణాటకల్లో ఇలా జరగలేదు. న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సాగుతున్నందున విభాగం పనితీరు, దర్యాప్తుపై ఆరోపణలకు ఆస్కారం లేదు. మేము వేసిన అభియోగపత్రాలు, ఆస్తుల అటాచ్మెంట్లే విమర్శలకు సమాధానం. నిందితుల్లో బెంగళూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి పరారీలో ఉన్నారని, త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు.
జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించేందుకు 366 ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టుకు సమర్పించామని, త్వరలో అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేయగా రూ.47.42కోట్లు వచ్చిందని తెలిపారు. మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు రూ.7కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. సీబీఐ విచారణ కావాలని కొందరు కోరారని, సీఐడీ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని వివరించారు. జైల్లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారని, మిగతా వారికి బెయిల్ వచ్చిందని తెలిపారు.