హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భవనాలను తెలంగాణ సర్కారుకు అప్పగించాలన్న గవర్నర్ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందా? గవర్నర్ ఆదేశాలకు రెండు రోజల ముందే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక సర్క్యులర్ ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తోంది. హైదరాబాద్ సచివాలయంలో, అసెంబ్లీలో రాష్ట్రానికి కేటాయించిన బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఆదివారం ( 2వ తేది) గవర్నర్ ఆదేశాలు జారీ చేయగా, అక్కడి మూటమల్లెను సర్ధుకుని 3వ తేది సాయంత్రానికల్లా వెలగపూడికి చేర్చాలని గత నెల 31వ తేదినే రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) జారీ చేసిన సర్క్యులర్ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో గవర్నర్ ఆదేశాలు జారీ చేసే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసని, సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడానికే గవర్నర్ ఆదేశాల కన్నా ముందుగానే సర్క్యులర్ జారీ చేసిందని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇతర భవనాలు, ఆస్తుల ప్రస్తావన ఈ సర్క్యులర్‌లో నామమాత్రంగా కూడా లేకపోవడం గమనార్హం. గవర్నర్ జారీ చేసిన ఆదేశాల్లో తెలంగాణ మంత్రిమండలి విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సచివాలయంలోని బ్లాక్‌ను టి. సర్కారుకు అప్పగించాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అంతకురెండు రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో హైదరాబాద్ సచివాలయ బ్లాకులో ఉన్న మంత్రులు, అధికారుల కార్యాలయాల్లోని దస్త్రాలు, కాగితాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలను 3వ తేదిలోగా వెలగపూడికి తరలించాలని ఆదేశించింది. ఆదేశాలు అందిన వెంటనే భద్రతా సిబ్బంది సమక్షంలో విలువైన వస్తువులను గుర్తించి, జాబితాను రూపొందించాలని.
ఆ తరువాత వాటిని వెలగపూడికి తరలించి, ఖాళీ అయిన గదులకు తాళాలు వేయాలని పేర్కొంది. వస్తువులను, గదుల తాళాలను 3వ తేది సాయంత్రానికి వెలగపూడి సచివాలయానికి చేర్చి తీరాలని కూడా ఆదేశించింది. 3వ తేది తరువాత ఎప్పుడైనా హైదరాబాద్ సచివాలయ గదులకు వేసిన తాళాలను పగలకొట్టి , అక్కడ ఉన్న వస్తువులను వేలం వేసే అవకాశం ఉందని ఈ సర్క్యులర్‌లో హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లోనూ రెండవతేది సాయంత్రానికి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ఖాళీ చేయాల్సిఉంది. అదే సమయానికి ఆ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. Source:prajasakthi