చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, మూడు రోజుల పాటు ఏపిలో పర్యటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సిద్ధార్థా కాలేజీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ స్థాయికి రావటానికి ఈ బెజవాడ నేల, కృష్ణా నది నీరు కారణం అనుకుంటా అని, ఈ ప్రాంతం పై తనకు ఉన్న మక్కువ చాటుకున్నారు. అలాగే విజయవాడ ప్రజలకు చురకలు కూడా అంటించారు. ఆయన మాటల్లోనే.. "విజయవాడ ప్రజలకు, చైతన్య వంతమైన ఇక్కడ ప్రజలకి, మీకు తెలుసు విజయవాడ అంటే. విజయవాడ అంటే బ్లేజ్ వాడ అని అంటూ ఉండే వారు. బ్లేజ్ వాడ అంటే మండే ఎండల వల్ల వచ్చే బ్లేజ్ వాడ కాదు, ఉష్ణోగ్రత ఎందుకు పెరిగింది అంటే, ఇక్కడ సైద్ధాంతిక వైరుధ్యాల కుంపటితోటితో ఈ విజయవాడ ఉంది. విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. అతివాద, మితవాద, అనేకమైన రాజకీయ సిద్ధాంతాలతో ఒకప్పటి పుట్టినిల్లు ఈ విజయవాడ. మీరు చూడండి, 1950 ఆ ప్రాంతంలో చూసుకున్నట్టు అయితే, ఇక్కడున్నటు వంటి నాయకులు, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలుగా ఇక్కడ నాయకులు ఎదిగారు. ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఇది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నుంచి, తరువాత 1983లో ప్రాక్టీస్ చేసినప్పుడు వరకు, లా స్టూడెంట్ గా ఉండి చదువుకున్నంత వరకు కూడా, ఇది ఒక అద్భుతమైన నగరంగా నేను భావించే వాడిని. 1983లో ప్రాక్టీస్ మొదట్లో రవీంద్ర గారు నా చేత తొలి అడుగు వేయించారు. "
"తరువాత హైదరాబాద్ కు మారాను, అయ్యప్ప రెడ్డి గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా పని చేసాను. అప్పట్లో విజయవాడ వదిలి, హైదరాబాద్ వెళ్ళాలి అంటే చాలా బాధ వేసింది నాకు. అతి కష్టం మీద విజయవాడ వదిలి, హైదరాబాద్ వెళ్ళాను. ప్రతి శుక్రవారం సాయంత్రం విజయవాడ వచ్చి, శనివారం, ఆదివారం విజయవాడలో ఉండేవాడిని. ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న ఆనందకరమైన అభ్యుదమైన వాతావరణం ఉండేది. ఇక్కడ అనేక మంది న్యాయవాదులు ఉన్నారు. ఒక న్యాయవాదులే కాదు, ఇక్కడున్న డాక్టర్లు, ఇక్కడున్న లెక్చరర్లు, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వారు ఉన్నారు. విజయవాడ కళలకు, సంస్కృతికి, చైతన్యానికి, పత్రికా రంగానికి, అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా ఉండే విజయవాడ, ఈ రోజు ఎందుకో నేను ఊహించినంత, ఆ రోజుల్లో ఉన్నంత గొప్ప స్థాయిలో లేదు అని చెప్పటానికి విచారిస్తున్నా. ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి జూలు విదిల్చి, చైతన్యవంతమైనటు వంటి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనః స్పూర్తిగా ఆకంక్షిస్తున్నా, ఇది నా హృదయంలో నుంచి వచ్చిన మాట" అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.