నీటి వివాదానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలు కావాలనే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాయని, ఇతరుల దృష్టిలో తెలుగు వారిని చులకన చేస్తున్నాయని, ఇద్దరు ముఖ్యమంత్రులు స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకునే అవకాశమున్నా ఆ దిశగా వారు ప్రయత్నించడం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "ఇద్దరు ముఖ్యమంత్రులు కీలకమైన నదీజలాల వివాదాన్ని పరిష్కరించుకోవ డానికి అడుగుకూడా ముందుకు వేయడం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ గారు నిన్ననే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక సూచన చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోండని గొప్ప సూచన చేశారు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆదిశగా ఎందుకు అడుగులు వేయలేదు? సొంతప్రయోజనాలకోసం మాత్రం ఇద్దరు బ్రహ్మండంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సలహాదారు కోసం ఒకఅధికారి కావాల్సివస్తే, ఆయన్ని ఆఘమేఘాలపై తెలంగాణ ప్రభుత్వం, ఏపీకి బదిలీచేసింది. ఆ అధికారిని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీగా నియమించారు. దాన్నిబట్టి అర్థమవుతోంది ఏంటంటే, ఇద్దరు ముఖ్యమంత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇబ్బందల్లా ప్రజలకు సంబంధించి మాత్రమే. ఈ విధంగా ఒక దురదృష్టకరమైన వాతావరణాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు సృష్టించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గారు కూడా ఎప్పుడో చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా వివాదాన్నిపరిష్కరించుకోవాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి వాతావరణం మంచిదికాదని చెప్పారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వాతావరణాన్ని తెరపైకి తెచ్చారని కూడా చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో కేటాయించిన 811 టీఎంసీల నీటి వాడకంలో రెండు రాష్ట్రాలు ఏవిధంగా వ్యవహరించాలో 2015లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలోనే స్పష్టం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలనే స్పష్టమైన నిబంధన ఉంది.
రెండురాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారులు, కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఏపీకి వచ్చిన 512 టీఎంసీల్లో ఎంత పరిమాణం నీటిని, ఏఏ అవసరాలకు వాడుకోవాలనే స్వేచ్ఛ, ఆ రాష్ట్రానికి ఉంటుంది. కానీ తాజాగా కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ చూస్తే, కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధి, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోనికి 107 ప్రాజెక్టులను కేంద్రం చేర్చింది. 107 ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఆయా నదీజలాల యాజమాన్య బోర్డులు చూస్తేసరిపోతుంది. నేరుగా కేంద్ర వ్యవస్థల పర్యవేక్షణ అవసరంలేదు. దానివల్ల మనహక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టినట్టైంది. ఈరోజు హైదరాబాద్ లోని జలసౌథలో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్రం తన వాదనలను సరిగా వినిపించినట్లు లేదు. రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి, వారి రాష్ట్రాల భవిష్యత్ కోసం పోరాడాల్సిన తరుణంలో, ఇద్దరూ కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో కొట్లాడుకున్నట్లు నటించడమేంటి? ఇద్దరూ పగలు కొట్లాడుకున్నట్లు నటిస్తూ, రాత్రి దోస్తీచేస్తున్నారు. ఇద్దరిని వారితో ఉండేవారే నమ్మడం లేదు. రాయలసీమ వాసిగా ఇద్దరు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడాల్సిన తరుణంలో రాయలసీమ భవిష్యత్ కు మ-ర-ణ-శా-స-నం రాయడం వారికి తగదని స్పష్టం చేస్తున్నా. ముఖ్యమంత్రులు అధికారంలో ఉంది అందుకు కాదు. ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలని కోరుతున్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు దొంగ నాటకాలు, మోసకారి నాటకాలకు స్వస్తిపలికి, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలని డిమాండ్ చేస్తున్నా