భారత దేశ చీఫ్ జస్టిస్, ఎన్వీ రమణ, గత మూడు రోజులుగా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. మూడో రోజు ఆయన న్యాయవాదులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేసారు. విజయవాడ కానూరులోని సిద్ధార్థ బీటెక్ కాలేజీలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఆయన న్యాయ వ్యవస్థ ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పారు. మన రాజ్యాంగం మూడు వ్యవస్థలు ఇచ్చిందని, ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే కచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయని అన్నారు. ప్రభుత్వాల నుంచి సరైన సహకారం, న్యాయ స్థానాలకు లభించటం లేదని అన్నారు. న్యాయ వ్యవస్థ ఎదుకుంటున్న ఇబ్బందులకు, ఇది కూడా ఒక కారణం అని అన్నారు. ఇంటర్నెట్ కేంద్రంగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారాలు కూడా, న్యాయ వ్యవస్థకు సవాల్ గా మారిందని అన్నారు. అలాగే ఇటీవల జడ్జిల పైన బౌతిక దా-డు-లు కూడా జరుగుతున్నాయని అన్నారు. తమకు అనుకూల తీర్పులు రాకపోతే, విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని, కోర్టులు కోరితే కానీ, విచారణ జరపటం లేదని, అన్నారు. ఈ పరిణామం మంచిది కాదని అన్నారు. కోర్టులు సవ్యంగా పని చేసే స్వేఛ్చ ఇవ్వాల్సింది, ప్రభుత్వాలే అని అన్నారు.
ఇక ఈ మధ్య కాలంలో పార్లమెంట్ వేదికగా జరిగిన చర్చలో, జడ్జిల పైన చేసిన విమర్శలు కూడా ఆయన తిప్పి కొట్టారు.జడ్జిలను జడ్జిలే నియమిస్తారు అంటూ ఈ మధ్య కాలంలో వింటున్నాం అని, అది భ్రమ మాత్రమే అని అన్నారు. జడ్జిల నియామకంలో, న్యాయ వ్యవస్థ ఒక భాగమే అని, కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలా అనేక మంది కలిసి జడ్జిలను ఎన్నుకుంటారని అన్నారు. ఇంత ప్రక్రియ ఉందని తెలిసినా, కొంత మంది కావాలని ఇలా మాట్లాడటం సరి కాదని అన్నారు. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ గురించి కూడా ఆవేదన వ్యక్తం చేసారు. ఈ వ్యవస్థ ప్రభుత్వాల చేతిల్లో పావుగా మారిపోయిందని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ స్వతంత్రంగా పని చేయాలని ఆయన అన్నారు. నిందితులను సహకరించే విధంగా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వ్యవస్థ ఉందని, అది మారాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసారు.