ఇవాళ మధ్యాహ్నం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల పనులలో పురోగతిని సమీక్షించారు. వివిధ ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తున్న వేళ, గండికోట ప్రాజెక్టుకు వచ్చేసరికి, ఆ కాంట్రాక్టర్, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్ వీడియో కాన్ఫరెన్స్ లో లేక పోవడం చంద్రబాబుకు కోపాన్ని తెప్పించింది.
గండికోట ప్రాజెక్ట్ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని, పనుల్లో జాప్యం జరిగితే తాను సహించబోనని హెచ్చరించారు... ఇదే వైఖరి, ఇదే లెక్కలేనితనం కొనసాగితే, తాను పోలీసు చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ప్రాజెక్టు సైట్ కు పోలీసులను పంపి అక్కడి సామాగ్రిని స్వాధీనం చేసుకుంటానని అన్నారు. ఇరిగేషన్ పనుల విషయంలో మాత్రం జాప్యాన్ని ఎంత మాత్రమూ సహించేది లేదని, ఎలాంటి వారినైనా ఉపేక్షించబోనని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాను నిత్యమూ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తుంటే, తనను మించి శ్రమించాల్సిన వారు అశ్రద్ధతో ఉన్నారని, ఇంత నిర్లక్ష్యాన్ని ఇకపై సహించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పోలవరం మీద సమీక్షిస్తూ, పనులను లక్ష్యం మేరకు 2019లోగా పూర్తి చేయాలంటే 60-సీ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.