దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబనాయుడు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. విభజన హామీలను సాధించుకునే క్రమంలో వివిధ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు పార్లమెంటులో బిజీబిజీగా గడుపుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు. అనంతరం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
అన్నాడీఎంకే నేత వేణుగోపాల్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలె, తారిక్ అన్వర్, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, తెరాస నేత జితేందర్‌రెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన వల్ల ఏపీకి కలిగిన నష్టం, దాని భర్తీకి కేంద్రం విభజన చట్టంలో పెట్టిన హామీలు, అవి కాక పార్లమెంట్ వేదికగా ఇచ్చిన వాగ్దానాలు... అవి అమలైన తీరు తదితర సమాచారాన్ని ఇందులో పొందుపర్చారు...
విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు... ఇంకా ఈ భేటీలు కొనసాగుతూనే ఉన్నాయి...