ఎట్టకేలకు పోలవరం పై ఒక క్లారటీ వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అంశం పై ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో దక్షిణ కొరియా బూసాన్ నుంచి ఫోనులో మాట్లాడారు.రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో గడ్కరీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గడ్కరీ తో ముఖ్యమంత్రి తన కొరియా పర్యటనకు ముందు సంప్రదించడానికి ప్రయత్నించగా కేంద్రమంత్రి లండన్ లో ఉండడం తో వీలు కాలేదు.
ఈ రోజు కొరియా నుంచి ఫోను చేసిన ముఖ్యమంత్రికి పోలవరం ప్రాజెక్టు ను తప్పకుండా 2019 నాటికి పూర్తి చేయడానికి తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయనీ, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేదనీ గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ రోజు కొంత మంది కాంగ్రెస్ నాయకులు పోలవరం విషయం లో తనను కలిసారనీ, వారితో కూడ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాననీ కేంద్ర మంత్రి అన్నారు. అయితే స్పిల్ వే, స్పిల్ ఛానల్ టెండర్ల విషయంలో ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాసం ఉంది...
ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ ప్రాజెక్టుకు రూ 381 కోట్లు విడుదల చేయడానికి ఉత్తర్వులు ఇచ్చామని గడ్కరీ చెప్పారు. పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసిన రూ 2,800 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేసారు. ఈ విషయాన్ని తొందరలో పరిష్కరిస్తానని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రులు, నాయకులకు కేంద్రమంత్రి గడ్కరి హామీ ఇచ్చారు. ఎవరూ ఎలాంటి ఆపోహలు పెట్టుకోవద్దని కూడా గడ్కరి ఆంధ్రప్రదేశ్ నాయకులకు చెప్పారు...