గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. అనంతపురం జిల్లాలోని 18 మండలాల్లో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సుమారు 20 వేల ఎకరాల్లో పంటలకు సాగునీరు అత్యవసరమని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రానున్న రెండు, మూడు వారాలు రాయలసీమలో వాతావరణం పొడిగానే వుంటుందని అటు షార్ అధికారులు సైతం తెలిపారు. దీంతో పంటలను కాపాడేందుకు తక్షణం రంగంలోకి దిగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ ఐదు రోజులు అనంతపురం జిల్లా అధికారులతో పాటు, రాష్ట్ర స్థాయి అధికారులు కరువు నివారణ చర్యల్లో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. రెయిన్ గన్లను, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను విస్తృతంగా వినియోగించాలని, వ్యవసాయ-జలవనరుల శాఖలు కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండిపోకూడదనేదే లక్ష్యం కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
పోలవరం సహా రాష్ట్రంలోని ప్రాధామ్య ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. పనులు సాగుతున్న తీరును వర్చువల్ ఇన్‌స్పెక్షన్ ద్వారా పరిశీలించారు. పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేయడం ఇది 34వ సారి.
ఈవారం 15,629 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తికాగా, ఇంకా 14.42 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు మిగిలి వున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రెండు రేడియల్ గేట్ల ఫాబ్రికేషన్, 15.8 మీటర్ల వరకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్‌కు సంబంధించి 3.26 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకం పనులు పూర్తికాగా, ఇంకా 28.73% మిగిలివుంది. పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. స్పిల్ చానల్‌పై నిర్మించ తలపెట్టిన కేబుల్ వంతెన నిర్మాణానికి సంబంధించి పలు డిజైన్లను ఈ సందర్భంగా పరిశీలించారు. తలమానికంగా నిలిచేలా డిజైన్లు రూపొందించి ఆగస్టు మొదటి సోమవారం నాటికి సమర్పించాలని ఇటలీకి చెందిన నిపుణులకు సూచించారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15 కల్లా ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొనగా, పంపులకు అవసరమైన మోటర్లు అందుబాటులో లేవని అధికారులు తెలిపారు. దీంతో సమీక్ష మధ్యలో బీహెచ్ఈఎల్ చైర్మన్‌తో మాట్లాడి ఆగస్టు మొదటివారం నాటికి మోటర్లు అందజేయాల్సిందిగా కోరారు. వివిధ ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలవారీగా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆగస్ట్ 1 కల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా వుండాలని చెప్పారు. పుణ్యక్షేత్రాల దర్శనంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను అందరూ సందర్శించుకునేందుకు వీలుగా పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని చెప్పారు.