ఉక్కు దీక్షని ఎగతాళి చేస్తూ, పవన్ చేసిన వ్యాఖ్యల పై కడప వాసులు మండిపడుతున్నారు. అలాగే టిడిపి నేతలు కూడా పవన్ పై మండిపడుతున్నారు. వైసీపీ, బీజేపీ నేతల సూటిపోటి మాటలు, గాలి ప్రకటనలపై మంత్రులు మండిపడ్డారు. మాట్లాడటం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎంపీ రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కడప పౌరుషాన్ని రెచ్చగొట్టద్దు. దీక్షను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నావు. జాగ్రత్త. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించు. నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీరు ఏం చేస్తారో ప్రకటించండి. దీక్ష పవిత్రతను వక్రీకరిస్తున్న మీ గురించి మాట్లాడాలంటే ఎంతో ఉంది. "
"ఇదేమీ సినిమా కాదు. ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా కాదు. నీవు చేసిన ఆరోపణలపై మనమిద్దరమే మాట్లాడుకుందాం. కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తావా? దీక్ష అంటే ఏమనుకుంటున్నావు? అసలు నీకు రాజకీయాలు తెలుసా? దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడు. అసలు జిందాల్‌లు నీకు తెలుసా? ఉక్కు దీక్ష భావితరాల కోసం చేస్తున్న దీక్ష అని తెలుసుకో’’ అంటూ ఆవేదనాగ్రహాలతో పవన్‌పై విరుచుకుపడ్డారు. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లు గడించిన గాలి జనార్దన్‌రెడ్డిని రంగంలోకి దింపేందుకు మోదీ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కడపను అడ్డంపెట్టుకుని ఎదిగిన జగన్ ఉక్కు గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవటం దారుణమన్నారు.
వేలాది లోడుల ఐరన్ ఓర్‌ను అక్రమంగా చైనాకు రవాణా చేసి వేల కోట్లు స్వాహా చేసిన గాలి తాజాగా రంగంపైకి వచ్చి ఫ్యాక్టరీ పెడతాననటం విడ్డూరం గా ఉందన్నారు. దీక్షను మొదలు పెట్టిన తరువాత మోదీ చెప్పిటన్లు గాలి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్రమే అడ్డుకుంటుందంటూ పవన్ చేసిన ప్రకటన ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. గవర్నర్ ఆరా తీశారు, ఇంకొకరు మాట్లాడారన్నది ఇప్పటి పరిస్థితికి సరిపోదనీ, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతపరిచేలా ఉక్కుపై గట్టి హామీ ఇ వ్వాలని మంత్రి కోరారు. మరో మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్.. దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అకుంఠిత దీక్షతో చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు అవహేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.