తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు రమేశ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేశ్ నివాసంలో 10 గంటలపాటు ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్ సోదరుడు సురేశ్ సమక్షంలో ఇవి కొనసాగాయి. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలుపై అధికారులు విచారించారు. అధికారులు తమ వద్ద నుంచి ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేశ్ సోదరుడు సురేశ్ తెలిపారు.
తాము నిజాయతీగా ఉన్నాం కాబట్టే 10 గంటల పాటు సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన అన్నారు. సోదాలు ముగిసిన తరువాత సియం రమేష్ కూడా మీడియాతో మాట్లాడారు ‘‘మా ఇంట్లో ఐటీ అధికారులకు ఏమీ దొరకలేదు. గంటలోనే అన్ని సోదాలు ముగించారు. టీవీ చూస్తూ ఐటీ అధికారులు సాయంత్రం వరకు... కాలయాపన చేశారని మా కుటుంబసభ్యులు చెప్పారు. జాతీయ మీడియాలో ఐటీ దాడుల విషయాన్ని చూసి... చాలా మంది నాయకులు ఫోన్లు చేశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాఫెల్ కుంభకోణంపై జేపీసీ ఎందుకు వేయడం లేదు? రాఫెల్ కుంభకోణంపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధమా? రిలయన్స్ కంపెనీకి అంత పెద్ద ఆర్డర్ ఇవ్వడం వెనుక.. మతలబు ఏంటో ప్రధాని మోదీ చెప్పాలి’’ అని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఏపీ విభజన హామీలు అమలు చేయమని కోరితే.. ఐటీ దాడులతో భయపెడతారా అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ అనే ఐటీ డైరెక్టర్ ఆధ్వర్యంలోనే ఐటీ దాడులు చేశారని, వారం క్రితం నుంచే ఐటీ దాడులకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.