కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అందుచేత దీక్ష విరమించాలని కోరారు. అయితే అధికారిక ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని రమేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వు లేకుండా ఎలా దీక్ష విరమించమంటారని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి సీఎం రమేశ్ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమకు 3వేల ఎకరాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు ఫోన్ చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు చెప్పిన సీఎం రమేశ్.. తాను రాష్ట్ర ప్రజల కోసం ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు.
కడప చాలా వెనుకబడిన జిల్లా అని, ఉక్కు పరిశ్రమ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించినదని చెప్పారు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ కేంద్రమే తీసుకోవాలని, తమకెలాంటి క్రెడిట్ అవసరం లేదని కేంద్రమంత్రికి స్పష్టంచేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని భాజపాకు మంచి పేరు వస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్‌బాడీని చూస్తారని బీరేంద్రసింగ్‌తో రమేశ్ అన్నారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రధానితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
బీరేంద్ర సింగ్‌ను గురువారం టీడీపీ ఎంపీలు కలిసారు. 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలిని రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు. ఆ లేఖపై చర్చలు జరిపిన అనంతరం బీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు. అధికారులతో చర్చల తర్వాతే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్‌కు పంపినట్టు ఏపీఎండీసీ చైర్మన్ వెంకయ్యచౌదరి చెప్పారు. ఆ పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/4X0Rfu2mmkI