టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఏకకాలంలో 60 మంది అధికారులు సోదాలు చేస్తున్ారు. హైదరాబాద్‌లోని నివాసంలో 10 మంది అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ దాడులపై ఆయన మీడియా సమావేశంలో మాట్లడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండగానే, ఐటి అధికారులు సియం రమేష్ కు ఫోన్ చేసారు. లైవ్ వస్తూ ఉండగానే, రమేష్ కు ఫోన్ చెయ్యటంతో, ఆయన కూడా లైవ్ లోనే ఐటి అధికారులకు సమాధానాలు చెప్పారు.
సోదాలకు మీరు తెలంగాణా అధికారులను మధ్యవర్తులుగా తీసుకెళ్ళారు, ఇది మంచి పద్ధతి కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం, మా పై ఎలా దాడి చేస్తుందో తెలియటం లేదా అంటూ ఐటి అధికారులని ఫోన్ లో అడిగారు. మీ ఉద్యోగాలకు కేంద్రం చెప్పినట్టు చేస్తారా అంటూ అధికారులని రమేష్ ప్రశ్నించారు. నా పై ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి, అనవసరంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నా వైపు నుంచి, మా పార్టీ కార్యకర్తల నుంచి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటూ, ఐటి అధికారులకు చెప్పారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందునే తనపై కుట్రపూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు.
ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని వేధించాలని చూస్తోంది. ఆంద్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర పన్నుతోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడేది లేదు. కడప ఉక్కు కర్మాగారంపై దీక్ష చేసినందునే నాపై దాడులు చేస్తున్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు డిమాండ్‌తో నేను దీక్ష చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కేంద్రం మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కర్మాగారం ఏర్పాటు పై నిలదీశాను. దీనికి ప్రతిఫలంగా మరుసటిరోజే నాపై ఐటీ దాడులు చేయించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే కేంద్రం ఐటీ దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది. సీఎం రమేశ్‌పై దాడులు జరుగుతాయని భాజపా, వైకాపా నేతలు కొద్దిరోజుల క్రితమే చెప్పారు. వైకాపా చెప్పినట్లే భాజపా నడుచుకుంటోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?. వారి కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారు. మాపై ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదు. కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టం చేశారు.