రాజకీయాలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేం. ఒక్క పూటలోనే ప్లేట్ మార్చేసే కాలం ఇది. అలాంటిది మొన్నటిదాకా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ, మోడీ, అమిత్ షా ల పై విమర్శలు చేసిన సియం రమేష్, నేడు బీజేపీ ఎంపీగా అదే రాజ్యసభలో అమిత్ షా చేత శభాష్ అనిపించుకున్నారు. అలాగే మొన్నటిదాకా సియం రమేష్ ని దొంగ అంటూ సంబోధించిన బీజేపీ, ఈ రోజు మా నాయకుడు సూపర్ అంటూ సియం రమేష్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇందులో ఎవరినీ తప్పుబట్టటానికి లేదు. ప్రజల్లోనే లేనిది, రాజకీయ నాయకుల్లో వస్తుంది అనుకోవటం మన భ్రమ. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న రాజ్యసభలో ఒక కీలక బిల్లు పాస్ అవ్వటానికి, బీజేపీకి సరైన మెజారిటీ లేదు. అదే సమయంలో సియం రమేష్ చక్రం తిప్పటంతో, బీజేపీ బిల్ పాస్ చేసుకో కలిగింది.
గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐకు సంబంధించి కీలకమైన సవరణ బిల్లు ఓటింగ్ కు వచ్చింది. అయితే రాజ్యసభలో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ సవరణ బిల్ ఆమోదం పొందటం చాలా కష్టం అని అందరూ భావించారు. కాని సియం రమేష్ చొరవతో ఈ సవరణ బిల్ కు రాజ్యసభలో లభించింది. ఈ బిల్ పై అనుకూలంగా వోట్ వెయ్యటానికి సియం రమేష్ గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలను సంప్రదించి, ఈ బిల్లుకు అనుకూలంగా ఒప్పించారు. ముఖ్యంగా బీజేడీ, టీఆర్ఎస్, వైసిపీ, పీడీపీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యటంతో, ఈ సవరణ బిల్ కు రాజ్యసభలో ఆమోదం లభించింది. మొత్తం మీద, ఈ బిల్లు పై అభ్యంతరం తెలుపుతూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన సవరణలను, 117 మంది తిరస్కరించగా, 75 మంది సభ్యులు అనుకూలంగా మద్దతు పలికారు.
మరో పక్క తెలుగుదేశం పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఒకరు, కనకమేడల రవీంద్రకుమార్, మరొకరు సీతామాలక్ష్మి. చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాత్రం, ఈ బిల్ పై వ్యతిరేకంగా మాట్లాడింది.ఆర్టీఐని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. అయితే ఎప్పుడూ లేనిది, సీతామాలక్ష్మి సభకు వచ్చి వోటింగ్ లో పాల్గునటం మాత్రం, ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బిల్లు పై మూజువాణి ఓటు నిర్వహించినపుడు టీడీపీ ఎటు ఓటేసినదీ వెల్లడి కాలేదు. ఆన్ రికార్డు మాత్రం, టిడిపి ఈ బిల్లు పై వ్యతిరేకంగా ఉంది. కాగా టీఆర్ఎస్ మాత్రం మొదట వ్యతిరేకంగా తెలిపినా, తరువాత ఆన్ రికార్డు సమర్ధించింది. అయితే కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలనీ ఒప్పించటంలో సియం రమేష్ కీలక పాత్ర పోషించారని, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్‌గోయల్‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు.