పోలవరం... ఇది ప్రతి ఆంధ్రుడి నరనరానా జీర్ణించుకుపోయిన ప్రాజెక్ట్... మొన్న రెండు రోజులు, పోలవరం పై కేంద్రం ఇబ్బందులకి గురి చేస్తుంది అని తెలియగానే, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా స్పందించారు... పోలవరానికి ఇబ్బందులు పెడితే ఎంత వరకు అయినా వెళ్తాం, అవసరమైతే అందరం విరాళాలు వేసుకుని పూర్తి చేస్తాం అంటూ ప్రతి పౌరుడు స్పందించాడు... అదే మూడ్ అఫ్ ది స్టేట్ గా, పోలవరం అనేది తన జీవిత ఆశయంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఇవాళ పోలవరం సందర్శన సందర్భంగా, అంతే ఘాటుగా స్పందించారు... పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తాను అంటూ హెచ్చరించారు.
తప్పుడు ఆరోపణలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు భావితరాలకు భద్రత అని గుర్తు చేశారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లు ఎలా వస్తాయని.. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ కుడికాలువకు నీరు విడుదల చేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులకు ఉదారంగా కాదు బాధ్యతగా పునరావాసం కల్పిస్తామని, ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితి వస్తే ఎంతవరకైనా వెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరంలో కాంక్రీట్ వర్క్స్ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్ పనులు పూర్తిచేసి కాఫర్ డ్యాం నిర్మిస్తే.. వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చన్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌పై రూ.12,506 కోట్లు ఖర్చుచేశామని, కేంద్రం నుంచి రూ.4,390 కోట్లు..ఇంకా రూ.3200 కోట్లు ఇవ్వాలని గుర్తు చేశారు. పవర్ ప్రాజెక్ట్‌కు రూ.4 వేల కోట్లు ఇవ్వాలని, 2013 చట్టంతో భూసేకరణ వ్యయం పది రెట్లు పెరిగిందని చెప్పారు. యూపీఏ తెచ్చిన చట్టం వల్లే పరిహారం ఖర్చు బాగా పెరిగిందని, ఆ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాలా వద్దా.. విపక్షాలు చెప్పాలన్నారు. 98 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని బాబు పేర్కొన్నారు. పోలవరం వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నామని, శ్వేతపత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు..