‘ఆదరణ-2’ పథకం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం అధికార యంత్రాంగం అలసత్వం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అన్నారు. లబ్దిదారుల సహనానికి పరీక్ష పెట్టేలా పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ‘ఆదరణ-2’పై ప్రజల్లో సంతృప్తి 54% మాత్రమే ఉండటాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి దీనిని సరిదిద్దుకోవాలని చెప్పారు. మరింత బాధ్యతగా వ్యవహరించి లబ్దిదారులకు తక్షణం ఉపకరణాలు అందేలా, వారంతా సంతోషంగా ఉండేలా చూడాలన్నారు. పెద్ద పరికరాలను ప్రత్యేక వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు గౌరవంగా తరలించాలని, నియోజకవర్గాల వారీగా పనిముట్లను లబ్దిదారులకు వెంటనే అందించాలని చెప్పారు. ఈ పనిముట్లతో ఆయా కుటుంబాలకు అదనపు ఆదాయం చేకూరాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘పేదలకు వైద్యసేవల్లో సంతృప్తస్థాయి పెరగాలి. అన్ని జిల్లాలలో 85% సంతృప్తి రావాలి. 108 సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు, సంచార చికిత్స, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, అన్ని పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరగాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదని, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని చెప్పారు. సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని ఈ తరహా సేవల్లో నాణ్యతను పెంచే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలన్నారు. డాక్లర్లు అందుబాటులో లేరని, మందుల కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. దశలవారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. న్యూట్రీ గార్డెన్లను అభివృద్ది చేసే బాధ్యతను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చి పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సంక్రాంతి పండుగ కల్లా అన్ని గ్రామాలు సుందరంగా మారాలని, ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం లేకుండా సరికొత్త శోభ రావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి షెడ్ల నిర్మాణం డిసెంబర్ 31 కల్లా పూర్తిచేయాలని చెప్పారు. అలాగే సంక్రాంతి కల్లా రాష్ట్రంలో ప్రతి గ్రామం ఎల్‌ఈడీ కాంతులతో నిండాలన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు లక్ష్యం 27.52 లక్షలు కాగా, ఇప్పటికి 18.96 లక్షలు (69%) పూర్తి చేశారని, మిగిలిన 7,525 గ్రామాల్లో 8.56 లక్షల వీధి దీపాల ఏర్పాటును 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఏపీఎల్‌ఈడీ ప్రాజెక్టు ఆరు జిల్లాలలో పూర్తయ్యిందని, జనవరి 15కల్లా మిగిలిన ఏడు జిల్లాలలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉదయం ఆరు గంటలకల్లా వీధి దీపాలు ఆపాలని, పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయని కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్టర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక యంత్రసామాగ్రి వినియోగంపై కార్యశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.