ఎన్నికల పోలింగ్ అనంతరం తొలిసారిగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై విహంగ వీక్షణం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 70శాతం పూర్తయ్యాయని చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. స్పిల్ వే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం పూర్తయితే… కరువును జయించినట్లేనన్నారు. కాఫర్ డ్యామ్ లో 52శాతం పని పూర్తయ్యిందన్నారు. డయాఫ్రం వాల్ వంద శాతం పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉన్నాయన్నారు.
30లక్షల క్యూసెక్కులు వదిలేలా గేట్ల నిర్మాణం జరుగుతుందన్నారు.25.72 మీటర్ల స్పిల్ వే పూర్తి చేసుకున్నామన్నారు. ప్రాజెక్టుకు రూ.16,493 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కేంద్రం సహకరించకున్నా… రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. కేంద్రం 6,727 కోట్లు ఇచ్చిందని.. ఇంకా 4,631కోట్లు రావాల్సి ఉందన్నారు. 1941 నుంచి ప్రతి ఎన్నికల సమయంలో పోలవరంపై మాట్లాడారన్నారు. పోలవరంపై 90 సమీక్షలు జరిపానని, 30సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించానన్నారు. 40లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. 980 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం స్పిల్ వే పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల పోలవరం పనులు కొద్దిగా నెమ్మదించిన మాట వాస్తవమేనన్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలేమీ అడగకపోవడంతో ‘ ఓకే ఇంక.. మీకేమీ డౌట్లు లేవు కదా. ప్రతిపక్ష పార్టీ మాదిరిగా. వాళ్లకు వాళ్లే డౌటు’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులంతా నవ్వేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రాగానే మీడియా మిత్రుల చిరకాల డిమాండ్ అయిన ఇళ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబు చేపట్టే సమీక్షలపై కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రాన్ని ధిక్కరిస్తూ పోలవరంలో పర్యటించారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ దూరంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు పోలవరం పర్యటన ముగిసింది. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, గేట్ల బిగింపు మొయిన్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. చంద్రబాబు పర్యటనలో పరిమిత సంఖ్యలోనే అధికారులు హాజరయ్యారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు.